అక్షరటుడే, వెబ్‌డెస్క్: Modi Andhra Pradesh Visit | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు పీఎంవో (PMO) అధికారిక ప్రకటన విడుదల చేసింది. పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో రూ. 17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Modi Andhra Pradesh Visit | భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
విజయనగరం జిల్లా భోగాపురంలో రూ. 5,640 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం’ను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. విశాఖపట్నంలో రూ. 460 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏపీ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్లాంట్‌లో సంవత్సరానికి సుమారు 9.6 కోట్ల చిప్‌లు తయారవుతాయని అంచనా వేస్తున్నారు.
Modi Andhra Pradesh Visit | పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు
రూ. 5,550 కోట్లతో కర్నూలు-IV రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కర్నూలు, అనంతపురం సోలార్, విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన రూ. 3,550 కోట్లు, రూ. 820 కోట్ల ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రూ. 1,880 కోట్లకు పైగా విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీనివల్ల విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు, విశాఖ-హైదరాబాద్ ప్రయాణ సమయం ఆదా కానుంది.
Modi Andhra Pradesh Visit | కర్ణాటకలో పర్యటన..
ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ కర్ణాటకలోని మైసూర్ చేరుకుంటారు. అక్కడ ‘స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం’ను ప్రారంభించి, బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇది కూడా చదవండి..: Bhogapuram Airport | పని మాది.. ప్రచారం మాత్రం టీడీపీది : వైఎస్ జగన్