Modi Hyderabad Visit | హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. చంద్రబాబు, పవన్ నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి భేటీ కానున్నారా..!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Hyderabad Visit | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వస్తుండటంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిత్రపక్ష నేతలతో సమావేశాలు కూడా ఉండటంతో బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఈ పర్యటనలో ప్రధాని మోదీ ముందుగా హైదరాబాద్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఏపీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి అంశాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Modi Hyderabad Visit | ప‌వ‌న్‌ని ప‌రామ‌ర్శించ‌నున్నారా..!

ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలో ప్రధాని పరామర్శించనున్నారు. ఈ భేటీ కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ (Pawan Kalyan) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ నివాసానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, ప్రధాని మోదీ మధ్య ప్రత్యేక సమావేశం జరిగే అవకాశంపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.రాజకీయ భేటీతో పాటు ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.

Modi Hyderabad Visit | అభివృద్ధి పనుల ప్రారంభం

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైల్వేలు, రోడ్లు, పట్టణ మౌలిక వసతులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నట్లు సమాచారం. అలాగే గచ్చిబౌలిలోని సాయిసింధు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొంటారు. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో (Pared Grounds) బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.. అక్కడి నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటు, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

దీనిని కూడా చదవండి : Bandhi Sanjay Case | ప్రధాని మోడీ ప్రోగ్రాం నుంచి బండి పేరు తొలగింపు.. మెడకు చుట్టుకున్న కొడుకు కీచక వ్యవహారం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *