అక్షరటుడే, వెబ్డెస్క్: Morbi Well Water | గుజరాత్ Gujarat లోని మోర్బీ జిల్లాలో ఓ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీర్‌పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీరు సముద్ర అలల్లా కదులుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో బావి వద్దకు చేరుకుంటున్నారు.
సమాచారం ప్రకారం, మూడు నెలల క్రితం తవ్విన ఈ బావి.. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా నీటితో నిండింది. అయితే గత ఆదివారం నుంచి బావిలోని నీరు ఒక్కసారిగా మసకబారడంతో పాటు అలల మాదిరిగా ఊగుతున్నాయి. దీంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Morbi Well Water | ప్రాథమిక అంచనా ఏమిటంటే..
ఈ ఘటనపై స్పందించిన జిల్లా జియాలజిస్టులు ప్రాథమిక అంచనాను వెల్లడించారు. గత 8 నుంచి 10 రోజుల వ్యవధిలో మోర్బీ జిల్లాలో ఎలాంటి భూకంపం, భూగర్భ ప్రకంపనలు నమోదుకాలేదని తెలిపారు. భూగర్భ శిలల మధ్య చిక్కుకుపోయిన వాయువుపై వర్షపు నీటి ఒత్తిడి పెరగడం వల్ల ఈ తరహా కదలికలు ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Morbi Well Water | విచారణకు ఆదేశం..
అయితే బావిలో నీరు అలల్లా కదలడానికి గల అసలు కారణాన్ని గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక విచారణకు ఆదేశించింది. భూగర్భ జల పరిశోధనా సంస్థ (GWRI) నిపుణులు ఘటనాస్థలాన్ని పరిశీలించి శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నారు. వారి నివేదిక అనంతరం ఈ వింత ఘటనకు గల అసలు కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.