Pakistan Mosque Blast | పాకిస్తాన్‌లో ఘోర బాంబు దాడి..మసీదులో ఆత్మాహుతి పేలుడు..15 మంది దుర్మరణం..56 మందికి తీవ్ర గాయాలు!

గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు.

Naresh Chandan

Pakistan Mosque Blastపాకిస్తాన్‌లో మరోసారి భారీ తీవ్రవాద దాడి విరుచుకుపడింది. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో ఒక దుండగుడు మసీదులోకి దూసుకెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ తీవ్ర ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దాదాపు 56 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Pakistan Mosque Blast | పోలీస్ కార్యాలయాలు ధ్వంసం.. ఐదుగురు సిబ్బంది మృతి

ఈ దారుణ ఘటన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు సమీపంలోని ‘ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా’ ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలో చోటుచేసుకుంది. పేలుడు దాటికి మసీదు భవనం తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, సమీపంలోనే ఉన్న పోలీస్ కార్యాలయాల బయటి గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఆత్మాహుతి పేలుడు అనంతరం ఆయుధాలతో లోపలికి ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు సాయుధులపై పోలీసులు తక్షణమే కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు.

Pakistan Mosque Blast | మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం!

సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pakistan Ship Collision | భారత నౌకను ఢీకొన్న పాక్​ షిప్​

ఈ ఘోర దాడిని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Pakistan Mosque Blast | పెరుగుతున్న ఉగ్రదాడులు

గత కొంతకాలంగా పాకిస్తానీ తాలిబన్ (టీటీపీ) మూకలు ఆ దేశ పోలీసులతో పాటు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేశాయి. 2023లో కూడా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాజధాని పెషావర్ లోని ఓ మసీదుపై జరిగిన భయంకరమైన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 101 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *