అక్షరటుడే, కామారెడ్డి: Gandhari Ganja Cultivation Bust | అధిక లాభాలు ఆర్జించవచ్చనే దురాశతో పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ముఠా గుట్టును గాంధారి పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి, సుమారు రూ. 12 లక్షల విలువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు.
Gandhari Ganja Cultivation Bust | పత్తి పంటలో అంతర పంటగా గంజాయి!
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తుమ్మల శివారులోని వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు జరుగుతోందనే పక్కా సమాచారంతో.. గాంధారి పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఉమ్మడిగా తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో పత్తి చేనులో అంతర పంటగా పెంచుతున్న సుమారు 400 పచ్చి గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. వెంటనే వాటిని వేర్లతో సహా తొలగించి జప్తు చేశారు. మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ. 12 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు.
Gandhari Ganja Cultivation Bust | భార్యాభర్తలతో పాటు మరొకరి అరెస్టు
సదాశివనగర్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడారు. గాంధారి శివారులోని సర్వే నంబర్ 110/ఆ 2/2 లో గల 3 ఎకరాల 26 గుంటల భూమిని కౌలుకు తీసుకున్న భార్యాభర్తలు మంజ సోనుసింగ్, మంజ మద్దిబాయి సుమారు 250 గంజాయి మొక్కలను పెంచుతున్నారు.
అదే ప్రాంతంలో సర్వే నంబర్ 110/అ లో 1 ఎకరం 20 గుంటల భూమిని కౌలుకు తీసుకున్న బస్సి జోద్రాజ్ అనే వ్యక్తి మరో 150 గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
అధిక లాభాలు వస్తాయనే ఆశతోనే వీరంతా ఈ అక్రమ సాగుకు పాల్పడినట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. నిందితుల వద్ద నుంచి గంజాయి సాగు కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Gandhari Ganja Cultivation Bust | కఠిన చర్యలు తప్పవు: డీఎస్పీ హెచ్చరిక
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సాగు, విక్రయాలు, రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా అక్రమ మార్గాల్లో మాదకద్రవ్యాలు సాగు చేసినా, ప్రోత్సహించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.