అక్షరటుడే, కామారెడ్డి : Tadwai BRS Protest | ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేపట్టే ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ప్రతిసారీ నిరసనలు హైటెన్షన్ కు దారితీస్తుండటంతో నేడు నిర్వహించే రైతు ధర్నాపై ఉత్కంఠ నెలకొంది.
Tadwai BRS Protest | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై..
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలకు నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ తాడ్వాయి (Tadwai) మండల కేంద్రంలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ ధర్నాకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరవుతారని బీఆర్ఎస్ ప్రకటించింది. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటూ ఊరూరా చాటింపు కూడా వేయించారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో ఈ ధర్నాకు అనుమతి ఇస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది.
Tadwai BRS Protest | యూరియా యాప్‌తో ఇబ్బందులు..
గత జూన్ నెలలో యూరియా యాప్ వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులపై ఇదే తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. అప్పుడు ప్రశాంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయనను తాడ్వాయికి రాకుండా హైదరాబాద్‌లోని నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ తాడ్వాయిలో బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా చేరుకోగా, ఒక వ్యక్తి పెట్రోల్ బాటిల్ తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి సాధారణ వ్యక్తిగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తాడ్వాయిలో, అదే రైతు సమస్యలపైనే ధర్నా జరుగుతుండటం, దానికి ప్రశాంత్ రెడ్డి హాజరవుతుండటంతో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ ఏడాది జూన్‌లో బీఆర్ఎస్ ధర్నాలో భాగంగా కార్యకర్త పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నం చేయగా బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న దృశ్యం
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సంచలన సవాల్