Paragliding Plane Collision| పారాగ్లైడర్‌ను ఢీకొట్టిన విమానం

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్:Paragliding Plane Collision|ఆకాశంలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఒక మహిళకు ఊహించని భయానక అనుభవం ఎదురైంది. ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ప్రయాణిస్తున్న ఒక చిన్న విమానం (టూరిస్ట్ ప్లేన్), గాల్లో ఉన్న పారాగ్లైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఉత్తర ఆస్ట్రియాలోని ష్మిట్టెన్‌హోహే పర్వత ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Paragliding Plane Collision | తృటిలో తప్పిన మరణం..

సాల్జ్‌బర్గ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 44 ఏళ్ల సబ్రినా అనే అనుభవజ్ఞురాలైన పారాగ్లైడర్, తన పారాచూట్‌కు కెమెరా అమర్చుకుని ఆకాశంలో విహరిస్తోంది. సరిగ్గా అదే సమయంలో 28 ఏళ్ల యువ పైలట్ నడుపుతున్న ఒక చిన్న మోటారు విమానం ఆమె తలకు కేవలం కొన్ని అడుగుల ఎత్తులో నుంచి దూసుకొచ్చింది. ఆ విమాన ప్రొపెల్లర్ (రెక్కలు) బలంగా తగలడంతో సబ్రినా పారాచూట్ సగానికి పైగా చిరిగిపోయింది.

Paragliding Plane Collision | సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకుంది..

నియంత్రణ కోల్పోయిన సబ్రినా గాల్లో గిరగిరా తిరుగుతూ వేగంగా నేల వైపు దూసుకొచ్చింది. ఆ భయాందోళనల్లోనూ ఆమె అధైర్యపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. తన వద్ద ఉన్న అత్యవసర ‘రిజర్వ్ పారాచూట్’ను చాకచక్యంగా తెరిచింది. దీంతో ఆమె వేగం తగ్గి సురక్షితంగా కిందకు ల్యాండ్ అవ్వగలిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్ట్రియా పోలీసులు హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పైలట్ కూడా విమానాన్ని ‘జెల్ ఆమ్ సీ’ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దించేశాడు.

Paragliding Plane Collision| బతికున్నానంటే నమ్మలేకపోతున్నా

ఈ భీకర ప్రమాదం నుండి పైలట్, సబ్రినా ఇద్దరూ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కేవలం చిన్న చిన్న గీతలు, కమిలిన గాయాలు తప్ప సబ్రినాకు ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. దీనిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. “నేను ఇక్కడ కూర్చుని ఈ మెసేజ్ టైప్ చేస్తున్నానంటే నాకే నమ్మకం కలగడం లేదు. ఒంటిపై కొన్ని చిన్న గాయాలు తప్ప నాకేమీ కాలేదు. దేవుడి దయ వల్ల బతికిపోయాను” అని జర్మన్ భాషలో పోస్ట్ చేసింది. గగనతలంలో చిన్న పొరపాట్లు ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ అని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: Petrol Price Hike | ఇంధన ధరల పెంపు ఇంకా ఆగదా?.. చమురు సంస్థల నష్టాలతో మరింత భారం తప్పేలా లేదే!

 

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *