అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PJTSAU VC Harassment | వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఆయనపై విచారణకు కమిటీ వేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల వైస్ ఛాన్స్లర్ జానయ్య తనను లైంగికంగా వేధించాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా ఉద్యోగులు, విద్యార్థులు నిరసనలు సైతం తెలుపుతున్నారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తనను వేధించారని ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పీహెచ్డీ పూర్తి చేయడానికి గడువు పొడిగించాలని ఆయనను కలిసిన అనంతరం వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. వీసీ అనుచితమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, విదేశాల్లో పనిచేస్తున్న తన భర్తను విడిచిపెట్టమని ఒత్తిడి చేశారని ఆరోపించారు. లైంగిక వేధింపులను తిరస్కరించడంతో తనను నిజామాబాద్‌కు బదిలీ చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఉన్నతాధికారులను, మహిళా భద్రతా విభాగాన్ని ఆశ్రయించినట్లు కూడా ఫిర్యాదులో తెలిపారు.
PJTSAU VC Harassment | ఐదుగురితో కమిటీ..
వీసీ జానయ్యపై ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కె. లక్ష్మి నేతృత్వంలో, ఐఏఎస్ అధికారులు రాహుల్ రాజ్, యాస్మిన్ బాషా, బి. గోపి, ఒక ఎన్జీవో ప్రతినిధి సభ్యులుగా ఈ కమిటీ ఉంది. 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
PJTSAU VC Harassment | మహిళా కమిషన్ సైతం..
ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12న విచారణకు రావాలని వీసీని ఆదేశించింది. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను తొలగించాలని విద్యార్థులు, సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన తెలుపుతున్నారు.
దీనిని కూడా చదవండి : Viksit Bharat 2047 | వికసిత్ భారత్ లక్ష్యం : ప్రధాని మోదీ