అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ravneet Singh Bittu | కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యసభ సభ్యునిగా ఆయన పదవీకాలం ముగియడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రి పదవిని కూడా వీడాల్సి వచ్చింది.
రవ్నీత్ సింగ్ బిట్టూ కేంద్ర మంత్రిగా కొనసాగేందుకు పార్లమెంట్ సభ్యత్వం తప్పనిసరి. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇటీవల ముగియడంతో రాజ్యాంగ ప్రకారం మంత్రి పదవిలో కొనసాగేందుకు అవకాశం లేకపోవడంతో రాజీనామా సమర్పించారు.
Ravneet Singh Bittu | మళ్లీ తీసుకుంటారా..?
బిట్టూ కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైల్వే శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆ శాఖలకు సంబంధించిన బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా పునర్విభజించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపితే లేదా మరోసారి పార్లమెంట్ సభ్యుడైతే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రవ్నీత్ సింగ్ బిట్టూ 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పంజాబ్ నుంచి ఎంపీగా గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.
Ravneet Singh Bittu | మంత్రివర్గంలో జరిగే మార్పులపై ఆస్తకి..
అనంతరం పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించగా, అదే ఆధారంగా కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆ సభ్యత్వం ముగియడంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన రవ్నీత్ సింగ్ బిట్టూ రాజీనామా రాజకీయంగా పెద్ద మార్పు కాకపోయినా, కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరిగే మార్పులు, కొత్త నియామకాలపై ఆసక్తి నెలకొంది.