అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shehzad Poonawalla | భారతీయ జనతా పార్టీ (BJP) యువ నాయకుడు, జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా బయో నుంచి ‘బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి’ హోదాను ఆయన తాజాగా తొలగించడమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది.
Shehzad Poonawalla | కొత్త బయో వివరాలు..
గురువారం పూనావాలా తన కొత్త ఎక్స్ బయో స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. అందులో ‘మతం: ఇస్లాం, సంస్కృతి: హిందువు, సిద్ధాంతం: భారతీయ. ‘జీఎస్టీ కీ యాత్ర’ పుస్తక రచయిత. ప్రధాని నరేంద్ర మోడీకి జీవితకాల అనుచరుడిని’ అని మాత్రమే రాసుకొచ్చారు. అయితే, ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో మాత్రం ఇంకా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగానే కొనసాగుతుండటం గమనార్హం. ఇప్పటివరకు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు లేదా బీజేపీ (BJP)ని వీడుతున్నట్లు ఆయన ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.
Shehzad Poonawalla | రెండు పాత వీడియోలు..
ఎక్స్ బయో మార్చిన రెండు గంటల తర్వాత, జూన్ 28, జులై 9 తేదీలకు చెందిన రెండు పాత వీడియోలను ఆయన రీట్వీట్ చేశారు. రాజకీయ నాయకుడిగా కాకుండా ఇతర మార్గాల్లోనూ సమాజానికి సేవ చేయవచ్చని ఆ వీడియోల్లో ఆయన పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాతే తప్పుకోవాలనుకున్నానని, అయితే ప్రధాని మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని చూసి మనసు మార్చుకున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసి, ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఆ వీడియోల్లో వివరించారు.
Shehzad Poonawalla | రాజకీయ ప్రస్థానం..
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన 38 ఏళ్ల షెహజాద్ పూనావాలా, 2017లో ఆ పార్టీలో వారసత్వ రాజకీయాలను, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన.. టీవీ డిబేట్లు, రాజకీయ వేదికలపై పార్టీ తరఫున గట్టిగా వాదిస్తూ బలమైన గొంతుకగా గుర్తింపు పొందారు. 2021లో ఢిల్లీ బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
షెహజాద్ పూనావాలా రాజీనామా..?
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది..
ఈ ప్రచారానికి కారణం.. ఆయన తన X (మాజీ ట్విట్టర్) ప్రొఫైల్‌లో ఉన్న “బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి” అనే హోదాను తొలగించడం. దీంతో రాజీనామా పై… pic.twitter.com/joxhWKu4bw
— iNews Telugu (@inewstelugu) July 31, 2026
ఇది కూడా చదవండి..: Xi Jinping India Visit | BRICS సదస్సు కోసం సెప్టెంబర్‌లో భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్..!