Shubhanshu Shukla | 2040 నాటికి చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం ఎగరడమే నా అతిపెద్ద కల: వ్యోమగామి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడు, వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shubhanshu Shukla | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడు, వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. 2040 నాటికి ఒక భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి, అక్కడ భారత జాతీయ జెండాను ఎగురవేయడాన్ని చూడటమే తన జీవితంలోని అతిపెద్ద కల అని ఆయన పేర్కొన్నారు.

పంజాబ్ ప్రభుత్వం (Punjab Government), చండీగఢ్ యంత్రాంగం, వెస్ట్రన్ కమాండ్ సంయుక్తంగా నిర్వహించిన 10వ మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు. 2025 జూన్‌లో ‘ఆక్సియమ్ మిషన్-4’ (Axiom Mission 4) ద్వారా తాను చేపట్టిన 20 రోజుల 3 గంటల చారిత్రాత్మక అంతరిక్ష ప్రయాణ అనుభవాలను ఈ వేదికపై పంచుకున్నారు.

Shubhanshu Shukla | గగన్‌యాన్ విజయమే తదుపరి లక్ష్యం..

అంతరిక్షంలో ఉన్నప్పుడు దేశ ప్రజలందరి ఆశీస్సులు తనకు అండగా ఉన్నాయనే భావనతో ఏనాడూ ఒంటరితనం అనిపించలేదని శుక్లా తెలిపారు. ప్రస్తుతం భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ (Gaganyaan) విజయవంతం చేయడంపైనే తన పూర్తి దృష్టి ఉందని చెప్పారు. అంతరిక్షం నుంచి తిరిగి భూమికి వచ్చే సమయంలో ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ.. స్పేస్‌క్రాఫ్ట్ అత్యంత వేగంగా, తీవ్ర కుదుపులతో ప్రయాణించిందని, ఆ క్షణాల్లో అసలు ఈ యాత్రకు ఎందుకు ఒప్పుకున్నానా అని కూడా అనిపించిందని సరదాగా గుర్తుచేసుకున్నారు.

Shubhanshu Shukla | మైక్రోగ్రావిటీ సవాళ్లు..

అంతరిక్షంలోని గురుత్వాకర్షణ లేని (Microgravity) వాతావరణానికి శరీరం అలవాటు పడటానికి సమయం పడుతుందని, దీనిని ఎదుర్కొనేందుకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక సంసిద్ధత ఎంతో అవసరమని ఆయన వివరించారు. యువత సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పట్టుదలతో రాణించాలని పిలుపునిస్తూ.. నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ తొమ్మిది సార్లు విఫలమైనా వెనక్కి తగ్గకుండా, 39 ఏళ్ల వయసులో అంతరిక్షంలోకి వెళ్లిన స్ఫూర్తిదాయక గాథను ఉదాహరణగా చెప్పారు. ఈ ఫెస్టివల్‌లో అంతరిక్ష సాంకేతికత, సైబర్ భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాముఖ్యతపై నిపుణులు చర్చించడంతో పాటు ఆయుధ ప్రదర్శనలు, వింటేజ్ కార్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇది కూడా చదవండి..: Punjab bus accident | ఘోర రోడ్డు ప్రమాదం : ఎదురెదురుగా ఢీకొన్న రెండు తీర్థయాత్ర బస్సులు.. ఐదుగురి దుర్మరణం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *