అక్షరటుడే, వెబ్డెస్క్: Punjab bus accident | పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఎంతో ఆనందంగా బయలుదేరిన ఆ యాత్రికుల ప్రయాణంలో పెను విషాదం అలుముకుంది. పంజాబ్లోని తరన్ తరన్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
54వ నంబర్ జాతీయ రహదారిపై నౌషెరా పన్నువాన్ సమీపంలో పంజాబ్ Punjab ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు తీర్థయాత్ర ఏసీ బస్సులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
Punjab bus accident | రెప్పపాటులో పెను విపత్తు
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. యాత్రికులతో అమృత్సర్ వైపు వెళ్తున్న ఒక బస్సు మార్గమధ్యలో అకస్మాత్తుగా అడ్డువచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి వేగంగా రోడ్డు డివైడర్ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. సరిగ్గా అదే సమయంలో అమృత్సర్ నుంచి ఎదురుగా వస్తున్న మరో తీర్థయాత్ర బస్సును అత్యంత వేగంగా ఢీకొట్టింది.
Punjab bus accident | బాంబు పేలినంత శబ్దం..
రెండు భారీ వాహనాలు ఢీకొన్న ధాటికి ఆ ప్రాంతమంతా బాంబు పేలినంత భయంకరమైన శబ్దం వినిపించిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రమాద తీవ్రతకు రెండు బస్సుల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేయడంతో రహదారిపై ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
నుజ్జయిన బస్సుల భాగాలను కట్టర్లతో తొలగించి, లోపల చిక్కుకున్న వారిని అతికష్టమ్మీద బయటకు తీశారు. ఈ దుర్ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న నలుగురు యాత్రికులతో పాటు, ప్రమాదానికి కారణమైన బైక్పై ఉన్న వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతి చెందారు.
Punjab bus accident | ఆస్పత్రిలో క్షతగాత్రులు
గాయపడిన 15 మందిని హుటాహుటిన తరన్ తరన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో ఈ రెండు ఏసీ బస్సుల్లో కలిపి మొత్తం 37 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Punjab bus accident | తీర్థయాత్ర పథకంలో విషాదం
రాష్ట్రంలోని 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, పౌరులు ఉచితంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర పథకం’ అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ పెను ప్రమాదం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..