అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad bus fire | హైదరాబాద్ నగర శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బౌరంపేట బొడ్రాయి సమీపంలోని ఒక ప్రైవేట్ గ్యారేజ్‌లో నిలిపి ఉంచిన ట్రావెల్స్ బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో గ్యారేజ్‌లో పార్క్ చేసిన ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.
Hyderabad bus fire | క్షణాల వ్యవధిలోనే బూడిదైన బస్సులు
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మరమ్మతులు, పార్కింగ్ కోసం గ్యారేజ్‌లో బస్సులను ఒకదానికొకటి అతి సమీపంలో నిలిపి ఉంచారు. తొలుత ఒక బస్సులో మొదలైన నిప్పురవ్వలు, ఆయిల్ ట్యాంకులు, సీట్లలోని ఫోమ్ కారణంగా రెప్పపాటులో పక్కనే ఉన్న మిగతా బస్సులకు కూడా వేగంగా వ్యాపించాయి. భారీగా నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Hyderabad bus fire | బెంబేలెత్తిన జనం
ఈ అగ్నిప్రమాదం జరిగిన గ్యారేజ్‌కు కూతవేటు దూరంలోనే పెట్రోల్ బంక్ ఉండటం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మంటలు ఏమాత్రం పెట్రోల్ బంక్ వైపు వ్యాపించినా ఊహించని పెను విపత్తు సంభవిస్తుందని చుట్టుపక్కల నివాసితులు, వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆ ప్రాంతమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Hyderabad bus fire | మూడు ఫైర్ ఇంజన్లతో శ్రమించిన సిబ్బంది
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, దుండిగల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించి, మంటలు పెట్రోల్ బంక్ వైపు వ్యాపించకుండా అడ్డుకున్నారు.
సుదీర్ఘ ప్రయత్నం అనంతరం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది, కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
Hyderabad bus fire | షార్ట్ సర్క్యూట్ కారణమా?
గ్యారేజ్ సమీపంలోని విద్యుత్ తీగల నుంచి షార్ట్ సర్క్యూట్ సంభవించి నిప్పురవ్వలు బస్సులపై పడటం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు, అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..