Tamil Nadu Crisis| గవర్నర్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

Shivam nagarani

అక్షరటుడే వెబం‌డెస్క్:Tamil Nadu Crisis | తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా, అత్యధిక సీట్లు సాధించిన టీవీకే-కాంగ్రెస్ కూటమిని ఆహ్వానించకపోవడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించింది. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Tamil Nadu Crisis | మోదీ, అమిత్ షాల కుట్ర..

ఈ రాజకీయ అనిశ్చితికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఒత్తిడి మేరకే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించింది. “గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం మానేసి, బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారారు” అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి, దొడ్డిదారిన అధికారాన్ని శాసించాలని చూడటం తమిళ ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tamil Nadu Crisis | రేపు భారీ ఎత్తున ఆందోళనలు..

గవర్నర్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం) తమిళనాడు వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళమెత్తాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదని వారు హెచ్చరించారు.

Tamil Nadu Crisis | గవర్నర్ తదుపరి అడుగుపై ఉత్కంఠ..

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు కమల్ హాసన్ వంటి ప్రముఖులు, మరోవైపు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు గవర్నర్ తీరును తప్పుబడుతుండటంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. ఈ ఒత్తిడి నేపథ్యంలో గవర్నర్ తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది? అతిపెద్ద కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారా? లేదా అనే అంశం ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చదవండి: Jailer Love Story | ఖైదీతో జైలర్ ప్రేమాయణం.. పెళ్లి పీటలెక్కిన అరుదైన ప్రేమకథ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *