Telangana Heavy Rains | నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Heavy Rains | తెలంగాణ (Telangana) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పారుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయి. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగాం, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telangana Heavy Rains | వర్షపాతం వివరాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం దంచికొట్టింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అత్యధికంగా 72.4 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి 69.2, వికారాబాద్​ జిల్లా మోమిన్​పేట 68, సంగారెడ్డి జిల్లా కంది 58.5, మెదక్​ జిల్లా పాపన్నపేట 54.6, టేక్మాల్​లో 48.6, మెదక్​ పట్టణం 48, నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో 48.2 మి.మీ. వర్షం కురిసింది.

Telangana Heavy Rains | తెరుచుకున్న జూరాల గేట్లు

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​ జలాశయాలు నిండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఆ జలాలు తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్​కు చేరుతున్నారు. రెండు రోజులుగా జూరాలకు ఇన్​ఫ్లో కొనసాగుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు విద్యుత్​ ఉత్పత్తి ద్వారా, గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు ప్రస్తుతం 32 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 30,700క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్​కు ప్రవాహం మొదలైంది. కర్ణాటక, మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కృష్ణా నదికి వరద ప్రవాహం మరింత పెరగనుంది.

ఇది కూడా చదవండి..: HYDRAA Commissioner | హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు వేటు : కఠిన చర్యల వెనుక ప్రజా ప్రయోజనమా? చట్ట ఉల్లంఘనా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *