అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Bans AI Term | సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అనే పదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Trump సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్‌తోపాటు అన్ని ఫెడరల్ ఏజెన్సీల అధికారిక పత్రాల్లో ‘AI’ అనే పదాన్ని వాడటాన్ని నిషేధించారు.
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న తరుణంలో ఈ పదం పూర్తిస్థాయి సామర్థ్యాన్ని ప్రతిబింబించడం లేదని, దీనికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (Super Intelligence – SI) అనే పదాన్ని మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
Trump Bans AI Term | ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ!
ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఒక ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ యంత్రాంగం, అధికారిక కమ్యూనికేషన్లు, ఫెడరల్ నివేదికలు మరియు విధాన రూపకల్పన పత్రాల్లో ఇకపై ‘AI’ అనే పదానికి స్వస్తి పలికి ‘SI’ అని మాత్రమే రాతపూర్వకంగా వాడాలని స్పష్టం చేశారు.
టెక్నాలజీ సాధిస్తున్న విప్లవాత్మక మార్పులు, అమెరికా సాధిస్తున్న సాంకేతిక నైపుణ్యం మరియు భవిష్యత్తు అవకాశాలను ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పేరు మరింత స్పష్టంగా, శక్తివంతంగా ప్రతిబింబిస్తుందని వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు. ‘ఆర్టిఫిషియల్’ అనే పదం కంటే ‘సూపర్’ అనే పదం అమెరికా ఆధిపత్యాన్ని, సాంకేతిక శ్రేష్ఠతను సూచిస్తుందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Trump Bans AI Term | గత నెల ఐరాసలో ప్రసంగిస్తూ..
గత నెల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన సందర్భంగా ట్రంప్ AIపై అమెరికా అనుసరిస్తున్న విధానం, సాంకేతిక ఆధిపత్యం గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ విస్తరణతో పోలిస్తే కృత్రిమ మేధస్సు మరింత విస్తృతమైన మార్పులకు దారితీసే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’కు బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI) అనే పదాన్ని ఉపయోగించాలనే ఆలోచనను ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన ప్రతిపాదనను తానే మొదట అమలు చేయాలని సంకల్పించి, నెల రోజుల్లోనే ఆచరణలో పెట్టారు.
Trump Bans AI Term | ప్రైవేట్ రంగానికి వర్తిస్తుందా?
ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కేవలం ఫెడరల్ ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ సర్క్యులర్లకు మాత్రమే పరిమితం కానుంది.
ప్రైవేట్ కంపెనీలు, మీడియాకు మినహాయింపు: సిలికాన్ వ్యాలీలోని మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ వంటి ప్రైవేట్ టెక్ దిగ్గజాలు లేదా మీడియా సంస్థల భాషా ఎంపికపై అధ్యక్షుడికి ఎలాంటి నియంత్రణ ఉండదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయినప్పటికీ, అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, టెక్ వర్గాల్లో ‘AI’ స్థానంలో ‘SI’ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి సాధారణ పద ప్రయోగాలలో సైతం తనదైన మార్క్ చూపే డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీ టెర్మినాలజీని కూడా తన శైలికి తగ్గట్టుగా మార్చేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది!
Super Intelligence | AIకి బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ పదం?.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రతిపాదన!