అక్షరటుడే వుబ్‌డెస్క్: Trump Iran Warning | అమెరికా ( US ) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్ విషయంలో మేం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నామో వేచి చూడండి.. త్వరలోనే మా చర్యలు మీరే చూస్తారు” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అలాస్కాలోని వాసిల్లా పట్టణంలో రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Trump Iran Warning | విరుచుకుపడ్డ ట్రంప్..
ఇరాన్ అరాచకాలకు గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. “ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండే ప్రసక్తే లేదు.. వారి అణు కార్యక్రమం ఇప్పటికే వేల టన్నుల రాళ్ల కింద కూరుకుపోయింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ గనుక అణ్వాయుధాలు సాధిస్తే ప్రపంచ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, దానిని నిరోధించే క్రమంలో చమురు ధరలు పెరిగినా భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అభిప్రాయపడ్డారు.
Trump Iran Warning | పెంటగాన్ సన్నాహాలు..
ఇరాన్‌పై అమెరికా మళ్లీ భారీ స్థాయి సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్‌పై మిలిటరీ ఆపరేషన్లను తిరిగి ప్రారంభించాల్సి వస్తే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖ (పెంటగాన్) ఆదేశించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘యాక్సియోస్’ వెల్లడించింది. ఈ మేరకు పెంటగాన్ సూచనలతో అమెరికా సెంట్రల్ కమాండ్ సంభావ్య సైనిక చర్యలకు సంబంధించి సన్నాహాలు పూర్తి చేస్తోందని, అయితే దాడులకు సంబంధించిన నిర్దిష్ట తేదీని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం.
Trump Iran Warning | నెతన్యాహుతో సుదీర్ఘ చర్చలు..
ఇరాన్ సైనిక స్థావరాలు , అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సంయుక్త దాడులు చేసే అవకాశాలపై ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో సుదీర్ఘంగా చర్చించినట్లు యాక్సియోస్ కథనం పేర్కొంది. ఇరు దేశాల్లో రాబోయే ఎన్నికలకు ముందే ఈ సైనిక చర్యలు జరిగే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఒకవైపు దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు క్షేత్రస్థాయిలో అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని కథనం తెలిపింది.
ఇది కూడా చదవండి: Tukkuguda Demolitions | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. భారీగా ట్రాఫిక్ జామ్