అక్షరటుడే, వెబ్‌డెస్క్: UAE OPEC Exit : ప్రపంచ చమురు మార్కెట్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 50 ఏళ్లకు పైగా సభ్యత్వం కొనసాగించిన OPEC నుంచి తాను వైదొలగనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి రానుంది.
ఈ నిర్ణయంతో యూఏఈ ఇకపై ఓపెక్ విధించే ఉత్పత్తి పరిమితులకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు. తద్వారా తన చమురు ఉత్పత్తిని స్వేచ్ఛగా పెంచుకునే అవకాశం కలుగుతుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది.
UAE OPEC Exit : ఇకపై స్వతంత్రంగా..
ప్రపంచ ప్రముఖ చమురు ఉత్పత్తిదారులలో యూఏఈ ఒకటిగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెట్టింది. ఓపెక్ కోటాల కారణంగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోయిన యూఏఈ, ఇప్పుడు స్వతంత్రంగా తన వ్యూహాలను అమలు చేయగలదు.
UAE OPEC Exit : ట్రంప్‌నకు అనుకూలంగానా..
యూఏఈ తాజా నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో ఓపెక్‌పై పలు విమర్శలు చేశారు. చమురు ధరలను కృత్రిమంగా పెంచుతూ ప్రపంచాన్ని దోచుకుంటోందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యూఏఈ నిర్ణయం ట్రంప్ అభిప్రాయాలకు మద్దతుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఓపెక్ నుంచి యూఏఈ వైదొలగడం ఇతర సభ్య దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయా..? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.