అక్షరటుడే వెబ్‌డెస్క్: Global Fuel Crisis | మిడిల్ ఈస్ట్‌లో అమెరికా ( US ) , ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడం, కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తింది. దీని ప్రభావంతో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి అగ్రరాజ్యాలు కూడా ఇంధన కొరతతో, రికార్డు స్థాయి ధరలతో అల్లాడిపోతున్నాయి. చాలా దేశాల్లో డీజిల్ దొరకడమే కష్టమైపోగా, పెట్రోల్ బంకులు మూతపడే దుస్థితి ఏర్పడింది.
Global Fuel Crisis | ఆకాశాన్నంటిన ధరలు..
అమెరికాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అక్కడ డీజిల్ సగటు ధర గాలన్‌కు $6.49 (మన దేశ కరెన్సీలో సుమారు రూ.622) అనే ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ఈ సంక్షోభం మొదలుకాకముందు (ఫిబ్రవరి 27న) ఇది కేవలం $3.75 (సుమారు రూ.360) మాత్రమే ఉండేది. అంటే దాదాపు 73 శాతం ధర పెరిగింది. ఇక కాలిఫోర్నియాలోనైతే డీజిల్ గాలన్‌కు $8.41 (సుమారు రూ.807) పలుకుతుండగా, పెట్రోల్ ధర $6.13 (సుమారు రూ.588కి)కి చేరింది. లారీలు, రైళ్లు, వ్యవసాయ యంత్రాలు పూర్తిగా డీజిల్‌పైనే ఆధారపడి నడుస్తుండటంతో.. రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా భారీగా ఎగిశాయి.
Global Fuel Crisis | ఖాళీ అవుతున్న పెట్రోల్ బంకులు..
ఫ్రాన్స్‌లో ఇంధన కొరత ముదిరిపోవడంతో ప్రతి 9 బంకుల్లో ఒకటి (సుమారు 11 శాతం) పూర్తిగా ఖాళీ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 16 శాతం బంకుల్లో చుక్క ఇంధనం కూడా దొరకడం లేదు. అక్కడ డీజిల్ సగటు ధర లీటరుకు 2.39 యూరోలు (సుమారు రూ.264) దాటింది. 700లకు పైగా బంకుల్లో ప్రీమియం ఇంధనం లీటరు రూ.276 నుంచి రూ.298 వరకు అమ్ముతున్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్.. జీ-7 దేశాలు తమ అత్యవసర వ్యూహాత్మక చమురు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
Global Fuel Crisis | బ్రిటన్‌పై ద్రవ్యోల్బణ భారం..
బ్రిటన్‌లోనూ ధరల మంట తీవ్రమైంది. ఆగస్టులో ఆ దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పెరిగింది. ఇంధన ధరలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 23 శాతం పెరగడం, విమాన ప్రయాణ ఛార్జీలు ప్రియం కావడమే దీనికి ప్రధాన కారణం. జూలై నుంచి ఆగస్టు మధ్యలోనే లీటర్ పెట్రోల్ ధర 9.1 పెన్స్ పెరిగి 161.3 పెన్స్‌కు (సుమారు రూ.206) చేరుకుంది.
Global Fuel Crisis | అసలు కారణం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్షోభం తలెత్తడానికి ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణా నిలిచిపోవడమే. దీనికి తోడు రష్యా, మిడిల్ ఈస్ట్‌లోని రిఫైనరీలు, ఆయిల్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాలకు ఆటంకాలు ఏర్పడటంతో డీజిల్ సరఫరా పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోనూ పెట్రోలు, డీజిలు కొరత తలెత్తుతుందా, ధరలు పెరుగుతాయా అనే భయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: CCTV Cameras for Safety | ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం : ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి