అక్షరటుడే వెబ్‌డెస్క్: US Embassy Security Alert | పశ్చిమాసియాలో (Middle East) మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) తన పౌరులకు కీలక భద్రతా హెచ్చరిక (Security Alert) జారీ చేసింది. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతి రెబెల్స్‌కు, సౌదీ అరేబియా కూటమికి మధ్య మళ్లీ పోరాటం తీవ్రమవుతున్న తరుణంలో ఈ అలర్ట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో అంతరాయాలు, విమానాల రద్దు లేదా గగనతల మూసివేత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలు, రాయబార కార్యాలయాలు, వ్యాపార సంస్థలను ఇరాన్ అనుకూల గ్రూపులు టార్గెట్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
US Embassy Security Alert | రియాద్‌పై హౌతీల క్షిపణి దాడి..
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని సున్నితమైన ప్రాంతాలపై క్షిపణులతో దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ భద్రతా హెచ్చరికలు వెలువడ్డాయి. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని అరామ్కో (Aramco) ఇంధన నిల్వ ట్యాంక్‌పై దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. అయితే, సౌదీ వైమానిక దళం ఆ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా కూల్చివేసిందని సౌదీ అరేబియా ధృవీకరించింది.
గతంలోనూ హౌతులు పౌర విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నారని, ఈ సైనిక సంఘర్షణ వేగంగా ఉధృతమయ్యే అవకాశం ఉందని యూఎస్ ఎంబసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతీయ ప్రయాణాలు చేసే అమెరికన్లు ఎయిర్‌పోర్టులు, విమాన సర్వీసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది. జెరూసలేంలోని ఎంబసీ, టెల్ అవీవ్‌లోని బ్రాంచ్ కార్యాలయం మాత్రం యథావిధిగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.
US Embassy Security Alert | పెరుగుతున్న ముప్పు..
ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత పశ్చిమాసియాలో అగ్గి రాజుకుంది. తాజాగా హౌతులు, సౌదీ అరేబియా మధ్య జరుగుతున్న పోరాటం ఈ యుద్ధంలో మరో కొత్త కోణంగా మారింది. యెమెన్‌లోని అత్యధిక జనాభా గల ఉత్తర ప్రాంతాలను నియంత్రిస్తున్న హౌతీలు.. సౌదీ నగరాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, ఎర్రసముద్రంలోని నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. ఇది ప్రపంచ చమురు సరఫరాకు, ఎర్రసముద్ర వాణిజ్య మార్గాలకు పెను ముప్పుగా పరిణమించింది. మరోవైపు, సౌదీ అరేబియాపై హౌతులు జరుపుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. పౌర, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల వల్ల మహిళలు, పిల్లలు గాయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Asian Games | ఆసియా క్రీడలు.. షూటింగ్లో భారత్‌కు రెండు రజతాలు