అక్షరటుడే వెబ్‌డెస్క్:BJP Bengal Victory|పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య రీతిలో ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బీజేపీ అక్కడ అఖండ విజయం దిశగా దూసుకుపోతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బెంగాల్‌లో అధికారంలోకి రావాలన్న దశాబ్దాల కల నెరవేరుతున్న తరుణంలో, బీజేపీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఒక ప్రత్యేక పోస్ట్ చేసింది. కాషాయం బెంగాల్‌ను తాకిందని, ఇక దేశమంతా ‘మోడీమయం’ అని ప్రకటిస్తూ, తమ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను హైలైట్ చేస్తూ ఒక ప్రత్యేక భారత రాజకీయ పటాన్ని విడుదల చేసింది.
BJP Bengal Victory |అభివృద్ధికి నిదర్శనంగా విస్తరణ..
ఈ విజయం కేవలం పార్టీ విస్తరణ మాత్రమే కాదని, ప్రధాని మోడీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి ప్రతీక అని బీజేపీ పేర్కొంది. ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు, ఉత్తరాది నుంచి ఈశాన్యం వరకు మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ అభివర్ణించింది. ఈ ప్రయాణంలో పశ్చిమ బెంగాల్ ఒక అతిపెద్ద అధ్యాయమని, ఈ స్ఫూర్తితోనే 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ మ్యాప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
BJP Bengal Victory |దేశవ్యాప్తంగా ఎన్డీయే పట్టు..
బీజేపీ పంచుకున్న తాజా మ్యాప్ ప్రకారం.. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే (NDA) కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కేవలం 9 ప్రాంతాలు మినహా దేశమంతా కాషాయ వర్ణంతో నిండిపోయింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, జమ్మూకశ్మీర్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలే పాలన సాగిస్తున్నాయని ఈ మ్యాప్ ద్వారా పార్టీ స్పష్టం చేసింది. బెంగాల్ విజయంతో దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందనే సందేశాన్ని ఈ పోస్ట్ ద్వారా పంపింది.
ఇది కూడా చదవండి: Dalit Ratna award | నిరంజన్ రాజ్‌కు ‘దళిత రత్న’ అవార్డు ప్రదానం

