అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad REIT Growth | దేశంలోని ప్రముఖ ప్రధాన కార్యాలయ మార్కెట్లలో హైదరాబాద్ అగ్రగామిగా దూసుకుపోతోందని ‘అసోచామ్-నైట్ ఫ్రాంక్ ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది. ‘బిల్డింగ్ వికసిత్ భారత్ – వృద్ధికి ఉత్ప్రేరకంగా రియల్ ఎస్టేట్’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (REIT) ప్రవేశం పరంగా దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. నగరంలోని మొత్తం ఆఫీస్ స్పేస్‌లో REIT యాజమాన్యంలోని ఆస్తుల వాటా ఏకంగా 20 శాతంగా ఉంది.
Hyderabad REIT Growth | భారీగా పెరిగిన REIT స్టాక్..
హైదరాబాద్‌లో మొత్తం 129.1 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండగా, అందులో 26.2 మిలియన్ చదరపు అడుగులు REIT మద్దతు కలిగినవే కావడం విశేషం. గతేడాది జూన్ 2025లో 12.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్న ఆఫీస్ REIT స్టాక్.. జూన్ 2026 నాటికి 26.2 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఏడాది వ్యవధిలోనే ఇది ఏకంగా 111 శాతం వృద్ధి చెందడం గమనార్హం. హైటెక్ సిటీ వంటి వాణిజ్య ప్రాంతాల్లో బలమైన నెట్వర్క్, సంస్థాగత మూలధన పెట్టుబడులు ఈ వృద్ధికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
Hyderabad REIT Growth | రిటైల్ రంగంలోనూ సంస్థాగత విస్తరణ..
కేవలం కార్యాలయాల రంగంలోనే కాకుండా రిటైల్ రంగంలోనూ సంస్థాగత రియల్ ఎస్టేట్ విస్తరిస్తోందని నివేదిక తెలిపింది. జూన్ 2026 నాటికి హైదరాబాద్‌లో 0.8 మిలియన్ చదరపు అడుగుల కార్యాచరణ రిటైల్ REIT ఆస్తులు నమోదయ్యాయి. వివిధ ఆస్తి తరగతుల్లో ఈ భాగస్వామ్యం కొనసాగుతుండటం విశేషం.
Hyderabad REIT Growth | పెరుగుతున్న సంస్థాగత మూలధనం..
ఈ నివేదికపై నైట్ ఫ్రాంక్ ఇండియా ( India ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోసెఫ్ తిలక్ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత మూలధనం వేగంగా పెరుగుతోందని తెలిపారు. పెద్ద ఎత్తున పోర్ట్‌ఫోలియోలను ఆకర్షించే సత్తా నగరానికి ఉందని, దేశంలో REIT నేతృత్వంలోని కార్యాలయ వృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: CP Radhakrishnan | తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకానున్న ఉప రాష్ట్రపతి