అక్షరటుడే వెబ్డెస్క్: Vepakayala Bathukamma | తెలంగాణ ( Telangana )పల్లెలు, పట్టణాలు అన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతూ నేడు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఏడో రోజున ప్రతి ఇంటా మహిళలు భక్తిశ్రద్ధలతో ‘వేపకాయల బతుకమ్మ’ను జరుపుకుంటున్నారు. ఆదిపరాశక్తి స్వరూపంగా భావించే వేపచెట్టుకు నీరాజనాలు అర్పిస్తూ, శక్తి స్వరూపిణి అయిన ఎల్లమ్మ తల్లిని ఇవాళ ప్రత్యేకంగా ఆరాధిస్తారు.
Vepakayala Bathukamma | ప్రత్యేక అలంకరణ ..
చామంతి, గునుగు, తంగేడు, గులాబీ వంటి రకరకాల పూలతో ఏడు వరుసలలో బతుకమ్మను ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. సకినాలు చేసే పిండితో చిన్న వేపపండ్ల ఆకారంలో ముద్దలు చేసి వాటిని బతుకమ్మపై అలంకరించడం ఈ రోజు ప్రత్యేకత. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి బెల్లం, పప్పును నైవేద్యంగా సమర్పిస్తారు.
సాయంత్రం వేళ మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలతో ఊరూవాడా హోరెత్తిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను చాటే ఈ వేడుకలతో వాతావరణం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.
ఇది కూడా చదవండి: Connaught Place Tiranga March | సీజేపీ తిరంగా మార్చ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు