అక్షరటుడే వెబ్డెస్క్: Viksit Bharat 2047 | 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యాన్ని చేరుకోవడంలో పాలన, ఆర్థిక పురోగతి ఎంత ముఖ్యమో.. పౌరుల భాగస్వామ్యం కూడా అంతే కీలకమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ( Venkaiah Naidu )స్పష్టం చేశారు. ‘భారత్ కీ సోచ్’ సంస్థ నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘మంత్రణ’ చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ నిర్మాణం అనేది కేవలం ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడి ఉండదని తేల్చిచెప్పారు.
Viksit Bharat 2047 | రాజ్యాంగ విలువలు..
ప్రభుత్వ విధానాలు భవిష్యత్తుకు మార్గనిర్దేశం మాత్రమే చేస్తాయని, అయితే పౌరులు తీసుకునే చర్యలే ఆయా ఫలితాల వేగాన్ని, విజయాన్ని నిర్ణయిస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. “ప్రభుత్వాలు సద్పాలన, అవసరమైన మౌలిక వసతులు , ఆర్థిక అవకాశాలను కల్పించాలి. అదే సమయంలో రాజ్యాంగ విలువలను కాపాడుతూ తమ పౌర బాధ్యతలను నిర్వర్తించడం ప్రతి పౌరుడి బాధ్యత” అని ఆయన వ్యాఖ్యానించారు. 2047 నాటికి దేశంలో ఆకలి, అణచివేత, వివక్ష , అసమానతలకు తావులేకుండా చూడాలని, కేవలం ఆర్థిక గణాంకాలు మాత్రమే కాకుండా సామాజిక సంక్షేమం, సమానత్వం, ఐక్యతలే నిజమైన ప్రగతికి సూచికలని అన్నారు.
Viksit Bharat 2047 | యువతకు పిలుపు..
ప్రాంతం, భాష, కులం , వర్గ విభేదాలకు అతీతంగా జాతీయ సమగ్రతను కాపాడుకోవడం అత్యంత అవసరమని ఆయన ఉద్ఘాటించారు. దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలోని యువత పెద్ద కలలు కనాలని, కష్టపడి పనిచేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు , అనుభవాన్ని గడించి, ఆ జ్ఞానాన్ని స్వదేశీ పురోగతి కోసం ఉపయోగించాలని యువతను ప్రోత్సహించారు.
Viksit Bharat 2047 | పటిష్ట సమాజానికి పునాది..
భారత్ కీ సోచ్ ఛైర్మన్ అనిల్ రాజ్పుత్ తన స్వాగత ప్రసంగంలో మాట్లాడుతూ.. “మౌలిక వసతులు, ఆధునిక నగరాలు, సాంకేతికత మాత్రమే అభివృద్ధికి ప్రమాణాలు కావు. ప్రతిరోజూ మనం ప్రదర్శించే పౌర బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తనే సమాజాన్ని నిర్మిస్తాయి. పబ్లిక్ ఆస్తులను పరిరక్షించడం, పర్యావరణాన్ని కాపాడటం, నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి విధి” అని పేర్కొన్నారు. కాగా, భారత్ కీ సోచ్ డైరెక్టర్ ఆర్.కే. పచ్నంద (ఐపీఎస్ రిటైర్డ్) మాట్లాడుతూ.. వికసిత్ భారత్ అనేది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదని, అది ప్రతి పౌరుడి నైతిక, పౌర బాధ్యత అని ముగించారు.
ఈ సందర్భంగా ‘భారత్ కీ సోచ్’ , ‘మానవ్ రచనా సెంటర్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ’ సంయుక్తంగా నిర్వహించిన ‘జన్ చేతన 2026’ వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన పాఠశాల విద్యార్థులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బహుమతులు ప్రధానం చేశారు.
ఇది కూడా చదవండి: Ghaziabad Wife Murder Plot | జిమ్ ట్రైనర్తో ఎఫైర్.. భర్త హత్యకు భార్య స్కెచ్ ..!