అక్షరటుడే వెబ్‌డెస్క్: BASF Kids Lab Hyderabad | చిన్నారుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతిష్టాత్మక సైన్స్ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ‘సిఎస్ఐఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ’ (CSIR-IICT) సహకారంతో అంతర్జాతీయ రసాయన దిగ్గజ సంస్థ ‘బీఏఎస్ఎఫ్’ (BASF) అక్టోబర్ 26 నుండి 31, 2026 వరకు ‘కిడ్స్ ల్యాబ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఇంటరాక్టివ్ విద్యా కార్యక్రమం ద్వారా హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 1,150 మంది విద్యార్థులకు ప్రయోగాత్మక అభ్యాసాన్ని అందించనున్నారు.
BASF Kids Lab Hyderabad | ఏమిటీ బీఏఎస్ఎఫ్ ‘కిడ్స్ ల్యాబ్’..
ప్రత్యేకంగా 8 నుండి 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆసక్తికరమైన ప్రయోగాలు, ప్రాక్టికల్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులలో సైంటిఫిక్ ఆలోచనను రేకెత్తించడం, సస్టైనబిలిటీ, వాతావరణ మార్పుల ప్రాముఖ్యతను వివరించడం ఈ ల్యాబ్ ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో విజయవంతమైన ఈ కార్యక్రమం, 2004లో భారత్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు 62,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులకు చేరువవైంది. 2023లో CSR కింద వాతావరణ పరిరక్షణ ప్రధాన థీమ్‌తో దీనిని పునఃప్రారంభించి చెన్నై, ముంబై (Mumbai ), బెంగళూరు, ఢిల్లీలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల పిల్లలకు కూడా విస్తరించారు.
BASF Kids Lab Hyderabad | బాధ్యతాయుతమైన పౌరుల నిర్మాణం..
పిల్లలు స్వయంగా ప్రయోగాలు చేసినప్పుడే కొత్త విషయాలు వేగంగా నేర్చుకుంటారని బీఏఎస్ఎఫ్ డిజిటల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్ హాఫ్కెన్ పేర్కొన్నారు. రసాయన శాస్త్రాన్ని పర్యావరణ పరిరక్షణతో అనుసంధానించడం ద్వారా రాబోయే తరాన్ని బాధ్యతాయుతమైన ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. కాగా, సీఎస్ఐఆర్-ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఇలాంటి ప్రయోగాత్మక విద్య ఎంతో విలువైనదని, సీఎస్ఐఆర్ ‘జిజ్ఞాస’ ప్రోగ్రామ్ లక్ష్యాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ విద్యాశాఖకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
BASF Kids Lab Hyderabad | విద్యార్థుల ఆనందం
ఈ ప్రయోగాల్లో పాల్గొన్న పేతేరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని గౌతమి తన అనుభవాన్ని పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది. నీటి శుద్ధి ప్రయోగం తనకు చాలా బాగా నచ్చిందని, వాలంటీర్లు ఎంతో స్నేహపూర్వకంగా సులభంగా అర్థమయ్యేలా వివరించారని తెలిపింది. ఈ రోజు నేర్చుకున్న పర్యావరణ పరిరక్షణ అంశాలను, సైన్స్ విషయాలను తన రోజువారీ జీవితంలో అమలు చేయడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటానని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Ghaziabad Wife Murder Plot | జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. భర్త హత్యకు భార్య స్కెచ్ ..!