KTR Rahul Letter | ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యల దుమారం.. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇంజినీర్లు, అధ్యాపకులను "క్రిమినల్ వేస్ట్" అని సంబోధించడంపై రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Rahul Letter | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇంజినీర్లు, అధ్యాపకులను “క్రిమినల్ వేస్ట్” అని సంబోధించడంపై రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక ఘాటైన బహిరంగ లేఖ రాశారు.

KTR Rahul Letter | కేటీఆర్ తీవ్ర ఆగ్రహం..

భారతీయ ఇంజినీర్లు ప్రపంచంలోని అగ్రగామి గ్లోబల్ కంపెనీలను నడుపుతూ, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతూ దేశ ప్రగతికి, ఉపాధికి బాటలు వేస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. అలాంటి అత్యున్నత ప్రతిభ కలిగిన విద్యార్థులను, గురువులను సీఎం ‘క్రిమినల్ వేస్ట్’ అనడం అత్యంత దారుణమని మండిపడ్డారు. దేశ రక్షణ, సాంకేతిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న వారిని అలా అనడమే కాంగ్రెస్ పార్టీ విధానమా అని నిలదీశారు. గతంలోనూ రేవంత్ రెడ్డి యూనివర్సిటీ విద్యార్థులను ‘బీరు బిర్యానీ బ్యాచ్’ అని అవమానించారని, ప్రశ్నించే వారిపై అడ్డగోలుగా నోరు పారేసుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

KTR Rahul Letter | క్షమాపణలకు డిమాండ్..

రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాహుల్ మౌనంగా ఉండడం అంటే ఆ వ్యాఖ్యలను ఆయన సమర్థించినట్లేనని విమర్శించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేత కూడా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.

KTR Rahul Letter | కేటీఆర్ హెచ్చరిక..

యువత రేపటి భారతదేశ నిర్మాతలు. విద్యార్థులు, యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇందిరమ్మ ఎమర్జెన్సీ సమయంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి అనుభవమైంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యువత కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. యువతను అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెసే అసలుసిసలు ‘క్రిమినల్ వేస్ట్’. వచ్చే రోజుల్లో తెలంగాణ యువత ఈ వ్యాఖ్యలకు తగిన సమాధానం చెబుతుంది” అని కేటీఆర్ తన లేఖలో హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy | అలా అయితేనే ఎన్నికల్లో పోటీ చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *