Vishal Garg CEO | జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగుల తొలగించి సీఈఓ.. ఇప్పుడు తన పదవినే కోల్పోయాడు

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఒకేసారి సుమారు 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గార్గ్ ప్రకటించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vishal Garg CEO | ఒకప్పుడు జూమ్ వీడియో కాల్‌లోనే వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన భారత సంతతి వ్యాపారవేత్త విశాల్ గార్గ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.

ఆయన సీఈఓగా వ్యవహరించిన ఫిన్‌టెక్ సంస్థ Better.comలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గార్గ్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించి, బోర్డు సభ్యుడిగా ఇటీవల చేరిన డేనియల్ లూయిస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

Vishal Garg CEO | తిరిగి నియమించాలని వేడుకోలు!

కాగా, తనను పదవి నుంచి తొలగించడంపై గార్గ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. లూయిస్‌పై నమ్మకంతోనే ఆయనను బోర్డులోకి తీసుకున్నానని, కానీ తనకు వ్యతిరేకంగా ఇతర డైరెక్టర్లను ఒప్పించి సీఈఓ పదవి నుంచి తొలగించారని గార్గ్ ఆరోపించారు. తిరిగి తనను సీఈఓగా నియమించాలని బోర్డు సభ్యులను కోరినట్లు సమాచారం.

Eeravathri Anil Criticism | నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు అర్వింద్​.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి : ఈరవత్రి అనిల్

Vishal Garg CEO | జూమ్ కాల్‌లో 900 మందికి షాక్

విశాల్ గార్గ్ భారత్‌లో జన్మించినప్పటికీ న్యూయార్క్‌లో విద్యాభ్యాసం చేశారు. న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకున్న ఆయన 2014లో Better.comను ప్రారంభించారు. సంస్థ వేగంగా అభివృద్ధి చెంది మంచి విలువను సొంతం చేసుకుంది.

అయితే, 2021లో కంపెనీ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఒకేసారి సుమారు 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గార్గ్ ప్రకటించారు. ఉద్యోగులను తొలగించిన తీరు, ముఖ్యంగా ఆ నిర్ణయాన్ని ప్రకటించిన విధానం తీవ్ర విమర్శలకు కారణమైంది.

తన చర్యపై వచ్చిన విమర్శల నేపథ్యంలో గార్గ్ అనంతరం వివరణ ఇచ్చి క్షమాపణలు తెలిపారు. ఉద్యోగులను తొలగించిన విధానం సరిగా లేదని అంగీకరించారు. కొంతకాలం సీఈఓ బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన తిరిగి అదే పదవిలో కొనసాగారు.

Vishal Garg CEO | నమ్మిన వ్యక్తే తన పదవి తీసుకున్నారని ఆరోపణ

తాజా పరిణామాలపై గార్గ్ ఓ ఇంటర్వ్యూలో తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, ఖర్చులను తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించే క్రమంలో సుమారు ఆరు నెలల క్రితం డేనియల్ లూయిస్ తనను సంప్రదించారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

లూయిస్‌పై నమ్మకంతోనే ఆయనకు బోర్డులో స్థానం కల్పించినట్లు గార్గ్ పేర్కొన్నారు. అయితే బోర్డులో చేరిన కొద్ది కాలానికే తనను సీఈఓ పదవి నుంచి తొలగించే ప్రక్రియ మొదలైందని ఆరోపించారు. ఇతర బోర్డు సభ్యులను తనకు వ్యతిరేకంగా ఒప్పించి లూయిస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారని గార్గ్ వాపోయారు.

Vishal Garg CEO | న్యాయపరమైన చర్యలకు అవకాశం ఉందా..

ఈ పరిణామంతో తాను మోసపోయినట్లు భావిస్తున్నానని గార్గ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. తనను తిరిగి సీఈఓగా నియమించాలని బోర్డును కోరుతున్న ఆయన, అవసరమైతే ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న గార్గ్.. ఇప్పుడు అదే సంస్థలో తన సీఈఓ పదవిని కోల్పోవడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *