Water Wastage Fine | నీటి వృథాపై జలమండలి చర్యలు.. రూ.10 వేల జరిమానా

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Water Wastage Fine | ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​ (Hyderabad) నగరంలో పలు ప్రాంతాల్లో నీరు సరిపోయినంత రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా కొందరు నీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వారిపై జలమండలి (HMWS SB) అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

బంజారాహిల్స్ పరిధిలో నీటి దుర్వినియోగంపై అందిన ఫిర్యాదును జలమండలి అధికారులు పరిశీలించి జరిమానా విధించారు. బంజారాహిల్స్‌లోని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయిరామ్స్ వెస్ట్‌ఎండ్ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి నీరు రోడ్డుపైకి వదులుతున్నట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు బంజారాహిల్స్ వార్డు, జూబ్లీహిల్స్ సర్కిల్, ఓ అండ్ ఎం డివిజన్ అధికారులు పరిశీలించారు.

Water Wastage Fine | రోడ్డుపైకి వదలడంతో..

ఆ అపార్ట్‌మెంట్‌కు నీటి సరఫరా రేపటికి షెడ్యూల్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఓవర్‌హెడ్ ట్యాంకుల శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా నీటిని రోడ్డుపైకి వదిలినట్లు గుర్తించారు. విలువైన తాగునీటిని వృథా చేయడం, రోడ్డుపైకి నీటిని వదలడం అనేది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత వినియోగదారునికి రూ.10,000 జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే, సంబంధిత వినియోగదారుడి నీటి సరఫరా సేవలను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

Water Wastage Fine | పొదుపుగా వాడుకోవాలి

జలమండలి పరిధిలోని వినియోగదారులు నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని, ట్యాంకులు శుభ్రపరిచే సమయంలో నీటిని రోడ్లపైకి వదలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. నీటి వృథా, అక్రమ వినియోగం, రోడ్లపైకి నీరు వదలడం వంటి అంశాలపై ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

దీనిని కూడా చదవండి: RCB Fans Hooliganism | ఆర్సీబీ గెలుపుతో రోడ్లపై హంగామా.. హద్దులు మీరుతున్న అభిమానం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *