అక్షరటుడే వెబ్‌డెస్క్: World Diabetes Day | ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమ శరీరంలో ఆ వ్యాధి ఉందనే విషయమే తెలియకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నవంబర్ 14న జరుపుకోనున్న ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’ ముందస్తు జాగ్రత్తల ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ప్రధాన ఇతివృత్తంతో డయాబెటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై అంతర్జాతీయంగా తీవ్రంగా దృష్టి సారిస్తున్నారు.
World Diabetes Day | అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా పిలువబడుతున్న భారతదేశంలో ఈ ముందస్తు హెచ్చరికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ది లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమైన ఐసీఎంఆర్ (ICMR-INDIAB) అధ్యయనం ప్రకారం.. మనదేశంలో సుమారు 10.1 కోట్ల (101 మిలియన్లు) మంది మధుమేహంతో బాధపడుతుండగా, మరో 13.6 కోట్ల (136 మిలియన్లు) మంది ప్రీ-డయాబెటిస్ (మధుమేహం వచ్చేందుకు సిద్ధంగా ఉన్న) దశలో ఉన్నారు. మనం తీసుకునే అతిగా సంస్కరించిన (ప్రాసెస్ చేసిన) ఆహారం, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువగా ఉండే తిండి అలవాట్లే ఈ ప్రమాదకర పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
World Diabetes Day | అదుపు చేసే బాదం పప్పులు..
మధుమేహ ముప్పును తగ్గించుకోవడానికి మనం రోజువారీ తీసుకునే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఇందులో భాగంగా కాలిఫోర్నియా బాదం పప్పులు ( Almond )వంటి నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బాదంపప్పులో సమృద్ధిగా లభించే ప్రొటీన్ (6 గ్రాములు), ఫైబర్ (3 గ్రాములు) రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తాయి.
World Diabetes Day | రోజూ నట్స్ తీసుకోవాలి ..
మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజనల్ హెడ్ రితికా సమద్దార్ మాట్లాడుతూ.. “ముందస్తు జాగ్రత్తలు అంటే పెద్ద పెద్ద మార్పులు కావు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాటించే చిన్నచిన్న మంచి అలవాట్లే. పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని పునాదిగా మార్చుకోవాలి. సమతుల ఆహారంలో భాగంగా రోజువారీ జీవితంలో బాదంపప్పులు తీసుకోవడం సులభమైన మార్గం” అని స్పష్టం చేశారు.
భారతీయులకు అవసరమైన పోషకాలపై ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ (ICMR-NIN) 2024 లో కీలక ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనల ప్రకారం.. పురుషులు రోజుకు 40 గ్రాముల నట్స్ తీసుకోవాలని సూచించింది. అలాగే మహిళలు తమ రోజువారి సమతుల ఆహారంలో భాగంగా రోజుకు 30 గ్రాముల నట్స్ తీసుకోవాలని సిఫార్సు చేసింది.
World Diabetes Day | దీర్ఘకాలిక ఆరోగ్య భద్రత..
మధుమేహం (డయాబెటిస్) వంటి దీర్ఘకాలిక వ్యాధులపై నిరంతరం అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని వైద్యాధికారులు తెలుపుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం , సమతుల్య జీవనశైలిని పాటించడం ద్వారానే శరీరానికి దీర్ఘకాలిక ఆరోగ్య భద్రత లభిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Keesara SI Bribery | ఛార్జీషీటు దాఖలు కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై