AIADMK MLAs Resign | తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: AIADMK MLAs Resign | తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ, రాజకీయ సమీకరణాలు మాత్రం వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు అకస్మాత్తుగా రాజీనామా చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. అన్నాడీఎంకే శాసనసభ్యులు సత్యభామ, మరగాథం, జయకుమార్ అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.

AIADMK MLAs Resign | మంత్రి ఆదవ్ అర్జునతో భేటీ..

పదవులకు రాజీనామా చేసిన వెంటనే ఈ ముగ్గురు నేతలు.. నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీకి చెందిన మంత్రి ఆదవ్ అర్జునతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరంతా త్వరలోనే అధికారికంగా టీవీకే (TVK) గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. గతంలో జరిగిన బలపరీక్ష సమయంలో కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

AIADMK MLAs Resign | స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ..

ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ జే.సి.డి. ప్రభాకరన్ వెంటనే ఆమోదిస్తారా? లేక పరిశీలనలో ఉంచుతారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఈ రాజీనామాలకు స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తమిళనాడులో ఉప ఎన్నికల సందడి మొదలుకానుంది. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచి ఈస్ట్ (Trichy East) స్థానంతో పాటు, ఇప్పుడు ఖాళీ అయ్యే ఈ మూడు నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అన్నాడీఎంకేకు గండి కొడుతూ జరిగిన ఈ రాజీనామాల వెనుక అధికార టీవీకే పార్టీ ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేసిందనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం.

AIADMK MLAs Resign | పళనిస్వామి ఆగ్రహం

టీవీకే పార్టీ, సీఎం విజయ్‌పై మాజీ సీఎం పళనిస్వామి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ విమర్శించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రాజీనామా చేసి ఫస్ట్‌ ఫ్లోర్‌లో కొత్త పార్టీ కండువా కప్పుకున్నారని ఎద్దేవా చేశారు. సినిమా పాపులారిటీతో అధికారంలోకి వచ్చిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ఇది కూడా చదవండి: MSME Growth Summit | ఏపీలో కోటి ఎంఎస్‌ఎంఈలను ప్రారంభించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *