US Iran Attacks 2 | మండుతున్న పశ్చిమాసియా: ‘ఆత్మరక్షణ’ ముసుగులో ఇరాన్​పై అమెరికా దాడులు.. ఇజ్రాయెల్ భీకర వ్యూహం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Iran Attacks 2 | పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) మరోసారి యుద్ధ మేఘాల నీడన అల్లాడుతోంది. శాంతి చర్చలు, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమవుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం బాంబుల మోత మోగుతూనే ఉంది.

తాజాగా ఇరాన్‌పై అమెరికా (యుఎస్) జరిపిన మెరుపు దాడులు, మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ పెంచిన దాడుల తీవ్రత ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరతలోకి నెట్టేస్తున్నాయి.

US Iran Attacks 2 | వ్యూహాత్మక దాడులు.. అమెరికా పాత పల్లవి!

దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ఉత్పాదక కేంద్రాలు (మిసైల్ సైట్స్), హార్ముజ్ జలసంధి సమీపంలో మైన్లు అమర్చుతున్న ఇరాన్ సైనిక పడవలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ భీకర దాడులు నిర్వహించింది. అయితే, ప్రతిసారీ లాగే ఈసారి కూడా వాషింగ్టన్ దీనిని “సెల్ఫ్ డిఫెన్స్” (ఆత్మరక్షణ) చర్యగా అభివర్ణించింది. తమ దళాల రక్షణ కోసమే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

ఒకవైపు ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు దోహా (ఖతార్) వేదికగా దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో, అమెరికా ఈ విధమైన సైనిక చర్యకు దిగడం అంతర్జాతీయ సమాజంలో పలు అనుమానాలకు తావిస్తోంది. చర్చల ప్రక్రియలో పైచేయి సాధించేందుకు అమెరికా ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తోందా? లేక క్షేత్రస్థాయిలో శాంతిని నెలకొల్పడం అమెరికాకు ఇష్టం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘కాల్పుల విరమణ’ అమల్లో ఉందని చెప్తూనే, సార్వభౌమాధికారం గల ఒక దేశంపై దాడులు చేయడం అమెరికా ద్వంద్వ విధానానికి అద్దం పడుతోంది.

US Iran Attacks 2 | హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఉక్కుపాదం.. నెతన్యాహు దూకుడు

ఇటు ఇరాన్‌పై అమెరికా దాడులు జరుగుతుండగానే, అటు లెబనాన్‌లో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేసింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడుతోంది. ముఖ్యంగా తూర్పు బెకా వ్యాలీ, బీరూట్ నగర శివార్లలోని హెజ్బొల్లా మౌలిక వసతులను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి.

ఇటీవల హెజ్బొల్లా ఉపయోగిస్తున్న సరికొత్త ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల ముప్పును తిప్పికొట్టేందుకు ఈ దాడుల తీవ్రతను పెంచినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హెజ్బొల్లాను పూర్తిగా అణచివేసే వరకు (Crush) విశ్రమించేది లేదని ఆయన చేసిన ప్రకటన, రాబోయే రోజుల్లో రక్తాపాతం మరింత పెరగనుందని హెచ్చరిస్తోంది.

US Iran Attacks 2 | ఒకే వ్యూహం.. ఇద్దరు శత్రువులు!

పశ్చిమాసియా సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తే, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఒక కచ్చితమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. హెజ్బొల్లాకు ప్రధాన ఆర్థిక, ఆయుధ ప్యాకేజీ ఇచ్చేది ఇరాన్ దేశమే. కాబట్టి, ఇటు ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికంగా బలహీనపరుస్తూనే.. అటు లెబనాన్‌లో హెజ్బొల్లాను నామరూపాలు లేకుండా చేయడం వీరి సంయుక్త వ్యూహంగా కనిపిస్తోంది.

US Iran Attacks 2 | మునిగిపోతున్న శాంతి ఆశలు

అమెరికా, ఇజ్రాయెల్‌ల ఉమ్మడి దాడులు పశ్చిమాసియాలో దౌత్యపరమైన పరిష్కారాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యంత్రాంగం ఒకవైపు ఇరాన్ అణు సామగ్రిని అప్పగించాలని డిమాండ్ చేస్తూనే, మరోవైపు దాడులకు దిగడం ఇరాన్ పాలకులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

బల ప్రదర్శనల ద్వారా శాంతిని స్థాపించలేరనేది జగమెరిగిన సత్యం. అమెరికా చెబుతున్న ‘ఆత్మరక్షణ’, ఇజ్రాయెల్ చెప్తున్న ‘సరిహద్దు భద్రత’ అనే వాదనలు సామాన్య పౌరుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఈ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే, ఈ ప్రాంతీయ ఘర్షణ కాస్తా ప్రపంచ శాంతికే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.

Iran US Tension | మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *