Iran US Tension | మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ అత్యవసర వ్యూహం.. మరో 72 గంటల్లో ఏమి జరగబోతోంది?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran US Tension | అంతర్జాతీయ రాజకీయ యవనికపై మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే 72 గంటల్లో ఏదో ఒక పెద్ద సంచలనం జరగబోతోందనే సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

అమెరికా వైట్ హౌస్ నుంచి టెహ్రాన్ వీధుల వరకు జరుగుతున్న ఆకస్మిక మార్పులు, దౌత్యపరమైన కదలికలు ఒక పెద్ద అంతర్జాతీయ సంక్షోభానికి నాంది పలుకుతున్నాయా.. అనే అనుమానాలను బలపరుస్తున్నాయి.

Trump Iran Strategy

Iran US Tension | వైట్ హౌస్‌లో అత్యవసర అలజడి.. రంగంలోకి ట్రంప్

ఇరాన్ విషయంలో ఒక స్పష్టమైన, కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసరంగా వైట్ హౌస్‌కు చేరుకోవడం ఈ ఉత్కంఠకు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది.

సాధారణంగా సుదీర్ఘ చర్చలు జరిగే వీకెండ్స్, సెలవు దినాల్లో కూడా అధ్యక్షుడు నేరుగా రంగంలోకి దిగారంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇరాన్ అణు కార్యక్రమాలు లేదా ఆ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలకు జరిగిన ముప్పుపై ట్రంప్ ఏదైనా ‘సర్ప్రైజ్’ నిర్ణయం తీసుకోబోతున్నారా.. అనే చర్చ నడుస్తోంది.

Iran US Tension | మెమోరియల్ డే వీకెండ్ టార్గెట్?

ఈ పరిణామాలు కేవలం మాటలకే పరిమితం కాలేదని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) చర్యలు నిరూపిస్తున్నాయి. అమెరికా సైనిక ఉన్నతాధికారుల ప్రతిష్ఠాత్మక మెమోరియల్ డే సెలవులను రద్దు చేయడం అత్యంత అరుదైన విషయం. ఇది ఒక భారీ ఆపరేషన్‌కు సైన్యం సిద్ధంగా ఉందనే దానికి సంకేతం.

అమెరికా ఈ 3 రోజుల మెమోరియల్ డే లాంగ్ వీకెండ్‌ను ఒక వ్యూహాత్మక అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు టాక్. చర్చలు గనుక పూర్తిగా విఫలమైతే, ఇరాన్‌పై అతి తక్కువ సమయంలో తీవ్రమైన నష్టాన్ని చేకూర్చేలా ఒక “హై-ఇంటెన్సిటీ, షార్ట్-డ్యూరేషన్” (తీవ్రమైన, స్వల్పకాలిక) సైనిక చర్యకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు.

మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) అంతటా అమెరికా తన సైనిక బలగాలను, యుద్ధ నౌకలను వేగంగా మోహరిస్తోంది. ఇరాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి ప్రతిఘటననైనా తక్షణమే అణచివేయడానికి లేదా ముందస్తు దాడి (Pre-emptive strike) చేయడానికి ఈ వ్యూహాత్మక మోహరింపులు జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

akshara today .jpgnouka
US Iran Tensions

Iran US Tension | ఇరాన్ క్లోజ్డ్ ఎయిర్‌స్పేస్

మరోవైపు ఇరాన్ సైతం ఈ ముప్పును ముందుగానే పసిగట్టి డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళింది. ఇరాన్ తన దేశవ్యాప్త ఎయిర్‌స్పేస్‌ను కాకుండా, ముఖ్యంగా పశ్చిమ ప్రాంత వైమానిక రంగాన్ని (Western Airspace) పూర్తిగా మూసివేసింది. శత్రుదేశాల క్షిపణులు లేదా డ్రోన్లు పశ్చిమ దిశ (ఇజ్రాయెల్ లేదా మధ్యధరా సముద్రం) నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్ అంచనా వేస్తున్నాయి. కేవలం పగటిపూట మాత్రమే పరిమిత సంఖ్యలో విమానాలకు అనుమతిస్తూ అత్యవసర NOTAM (Notice to Air Missions) జారీ చేసింది.

తన వైమానిక రంగాన్ని (Airspace) ఇరాన్ మూసివేయడం అంటే, శత్రుదేశాల క్షిపణి లేదా డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను (Air Defense Systems) సిద్ధం చేసుకున్నట్లే భావించాలి.

Iran US Tension | దౌత్యం కోసం ఉరుకులు పరుగులు..

ఇదిలా ఉంటే మరోవైపు అత్యవసర చర్చల కోసం పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకోవడం గమనార్హం. యుద్ధాన్ని నివారించేందుకు మధ్యవర్తిత్వం వహించడమా..? లేక యుద్ధం వస్తే అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించడమా..? అనే కోణంలో దౌత్య వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఖతార్ సర్కారుకు చెందిన ఒక వీఐపీ (VIP) జెట్ విమానం అత్యవసరంగా బయలుదేరినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాలో తేలింది.

అయితే అది నేరుగా ఖతార్ వెళ్లకుండా.. ఇరాన్ ఎయిర్‌స్పేస్ నుంచి వీలైనంత త్వరగా బయటపడటానికి వాయువ్య (Northwest) దిశగా ప్రయాణించినట్లు సమాచారం. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతార్ ప్రతినిధులు ఇరాన్‌తో జరిపిన చివరి నిమిషం చర్చలు ఎంత ఉత్కంఠగా సాగాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొనవచ్చు.

Iran US Tension | ఇవన్నీ యాదృచ్ఛికమా?

అంతర్జాతీయ నిఘా సంస్థలు (International Intelligence) తీవ్ర అప్రమత్తతతో ఉండటం, ఈ పరిణామాలన్నీ ఒకే కాలక్రమంలో (Timeline) జరగడం కేవలం కాకతాళీయం లేదా యాదృచ్ఛికం ఎంతమాత్రం కావంటున్నారు. దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక లేదా ఒక అదృశ్య సంక్షోభం దాగి ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ గత విధానాలను పరిశీలిస్తే, ఆయన “గరిష్ట ఒత్తిడి” (Maximum Pressure) వ్యూహాన్ని నమ్ముతారు. ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికంగా పూర్తిగా ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ తాజా వ్యూహం ఉండవచ్చు.

అయితే, మిడిల్ ఈస్ట్‌లో ఇప్పటికే ఉన్న అస్థిరత నేపథ్యంలో, అమెరికా తీసుకోబోయే ఏకపక్ష నిర్ణయం మరో సుదీర్ఘ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ చమురు మార్కెట్‌ను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

రాబోయే 72 గంటలు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. అమెరికా సైనిక చర్యకు దిగుతుందా? లేదా ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు భారీ దౌత్యపరమైన, ఆర్థిక ఆంక్షల ప్రకటన చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

ఏది ఏమైనప్పటికీ, టెహ్రాన్ ఆకాశం మూతపడటం, వైట్ హౌస్ లైట్లు రాత్రంతా వెలగడం ప్రపంచాన్ని ఒక కొత్త యుద్ధ భయం నీడలోకి నెట్టేస్తున్నాయి.

Iran US Tension | ఇజ్రాయెల్ అసంతృప్తి

ఈ సంక్షోభంలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ట్రంప్ ఇరాన్‌తో డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నించడంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్ తన పట్టుదలను వీడకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరిస్తూనే, మరోవైపు దౌత్య మార్గాలను తెరిచే ఉంచింది.

oil

Iran US Tension | చమురు సెగ

మిడిల్ ఈస్ట్‌లో ఒకవేళ యుద్ధం గనుక తీవ్రరూపం దాల్చితే.. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది.

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్, ఇంధన ధరలు పెరగడంపై అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో ఇతర దేశాలతో (భారత్ వంటి ప్రధాన దిగుమతి దేశాలతో) ఇంధన భద్రతపై అత్యవసర చర్చలు జరుపుతున్నారు.

ఏది ఏమైనా.. దౌత్యపరమైన శాంతి చర్చలు ఒకవైపు.. క్షణాల్లో దాడికి సిద్ధంగా ఉన్న సైనిక బలగాలు మరోవైపు.. రాబోయే కొన్ని గంటలు మిడిల్ ఈస్ట్ భవితవ్యాన్ని మార్చబోతున్నాయి.

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *