అక్షరటుడే, గాంధారి: Polycet State First Ranker | తల్లిదండ్రుల అహర్నిశల శ్రమ, పిల్లల పట్టుదల తోడైతే విజయం వారి ఇంటి చిరునామాగా మారుతుందని నిరూపించింది ఆ కుటుంబం.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే గూటి పక్షుల్లాంటి ఆ అక్కాతమ్ముళ్లు ఇద్దరు తెలంగాణ రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించి సంచలనం సృష్టించారు.
2023లో కూతురు రాష్ట్ర టాపర్‌గా నిలిస్తే, తాజాగా విడుదలైన 2026 పాలిసెట్ ఫలితాల్లో కుమారుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఆ తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చి, వారి కళ్లల్లో ఆనందబాష్పాలు నింపాడు.
Polycet State First Ranker | రికార్డుల వేట!
హైదరాబాద్‌లోని అమీన్పూర్ మండలం, శ్రీవాణి కాలనీకి చెందిన అన్నం భాగ్యలక్ష్మి, గంగాధర్ దంపతులకు ఇద్దరు సంతానం.
కుమారుడు హరికృష్ణ, కుమార్తె అక్షర. తాజాగా ప్రకటించిన పాలిసెట్ ఫలితాల్లో హరికృష్ణ ఎంపీసీ (MPC) విభాగంలో 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి, రికార్డుస్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.
కాగా, ఇతని సోదరి అక్షర 2023 ఈసెట్ (ECET-CSE) విభాగంలో అప్పట్లోనే రాష్ట్రస్థాయి టాపర్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.
ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు వరుసగా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాలు సాధించడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

Polycet State First Ranker | “మా అమ్మనాన్నల కష్టమే టాపర్‌ను చేసింది”
“నేను ఈ రోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి ప్రధాన కారణం మా అమ్మనాన్నలే. వారు పగలు, రాత్రి కష్టపడుతూ మా చదువుల కోసం ఎంతో త్యాగం చేశారు. వారు చూపిన మార్గదర్శకత్వంలో, వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఈ విజయాన్ని అందుకోగలిగాను. ఈ ర్యాంక్‌ను నా తల్లిదండ్రుల కష్టానికి అంకితం ఇస్తున్నాను.” అని పాలిసెట్ టాపర్ హరికృష్ణ తెలిపాడు.

Polycet State First Ranker | పిల్లలపై నమ్మకమే పెట్టుబడి: తల్లిదండ్రుల హర్షం
తమ పిల్లల అసాధారణ ప్రతిభపై తల్లిదండ్రులు గంగాధర్, భాగ్యలక్ష్మి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
“మేము మా పిల్లలను ఎప్పుడూ ఒత్తిడికి గురిచేయలేదు. వారిపై పూర్తి నమ్మకంతో పెంచాం. వారికి ఇష్టమైన సబ్జెక్టులపై అవగాహన పెంచుకోమని, నచ్చిన కోర్సులను ఎంచుకోమని పూర్తి స్వేచ్ఛనిచ్చాం.”
“మా వంతుగా మేము ఎంత కష్టపడటానికైనా సిద్ధపడి వారిని చదివించాం. మా నమ్మకాన్ని నిజం చేస్తూ, మా కష్టాన్ని గౌరవిస్తూ వారిద్దరూ రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మా పేరు నిలబెట్టడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తోంది.” అని గద్గద స్వరంతో పేర్కొన్నారు.
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు స్టేట్ టాపర్లుగా ఎదగడం పట్ల స్థానికులు, బంధువులు, విద్యా ప్రముఖులు.. అన్నం గంగాధర్ దంపతులకు, వారి పిల్లలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ మధ్యతరగతి తల్లిదండ్రుల శ్రమ, ఆ పిల్లల ప్రతిభ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..


