Bihar DSP Gautam Kumar | అధికార బలం.. అక్రమ ధనం.. ఐదుగురు లవర్ల ‘సినిమా’ కథనం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar DSP Gautam Kumar | ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతి తిమింగలాలు ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ పోలీస్ శాఖకు చెందిన ఒక డీఎస్పీ (DSP) గౌతమ్ కుమార్ అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

అయితే, ఈ వాస్తవ అవినీతి కథనానికి సోషల్ మీడియా వేదికగా తోడైన ‘ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్, లగ్జరీ లైఫ్’ అనే మసాలా.. ప్రస్తుతం సమాజంలో వెర్రితలలు వేస్తున్న ‘సంచలన సంస్కృతి’కి (Sensationalism) అద్దం పడుతోంది. ఈ లవర్ల విషయమై అధికారికంగా ఎక్కడా పేర్కొనకపోయినా.. సామాజిక మాధ్యమాలను షేక్​ చేస్తోంది.

Bihar DSP Gautam Kumar | చట్టం కళ్లు కప్పి.. రూ.కోట్లు కూడబెట్టి!

సబ్-ఇన్‌స్పెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, పదోన్నతులతో డీఎస్పీ స్థాయికి చేరిన సదరు అధికారి.. చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉండి భక్షకుడిగా మారాడనేది దర్యాప్తు సంస్థల ప్రాథమిక నివేదికల ద్వారా స్పష్టమవుతోంది.

కిషన్‌గంజ్ వంటి కీలక ప్రాంతాల్లో పనిచేసిన కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, బీహార్ దాటి పశ్చిమ బెంగాల్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి, విలాసవంతమైన కోటలు కట్టడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.

ఒకవైపు భార్య ఉపాధ్యాయురాలిగా సాధారణ జీవితం గడుపుతుంటే.. సదరు అధికారి మాత్రం అక్రమార్జనతో ‘లగ్జరీ కింగ్’లా బతకడం నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. ఆర్థిక నేరాల విభాగం (EOU) జరిపిన దాడులు ఈ అవినీతి తిమింగలం అసలు రంగును బయటపెట్టాయి.

akshara today .jpgdsp

Bihar DSP Gautam Kumar | సోషల్ మీడియా గాసిప్స్

అయితే, ఈ కేసులో అవినీతి కంటే ఎక్కువగా చర్చకు దారితీసింది సదరు అధికారి వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ప్రచారమే. “అధికారికి ఐదుగురు ప్రియురాళ్లు ఉన్నారు.. అందరికీ విడివిడిగా బంగళాలు, కార్లు కొనిచ్చారు” అంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు హోరెత్తుతున్నాయి.

దర్యాప్తు సంస్థల ఎఫ్‌ఐఆర్ (FIR) లో గానీ, అధికారిక ప్రెస్ నోట్లలో గానీ ఎక్కడా ఈ ‘ఐదుగురు ప్రియురాళ్ల’ ప్రస్తావన లేదు.

డిజిటల్ మీడియా యుగంలో కేవలం లైక్‌లు, వ్యూస్, క్లిక్‌ల కోసం ఒక అవినీతి కేసును.. సినిమా స్క్రిప్ట్ లాగా మార్చే ధోరణి పెరిగిపోయింది.

అవినీతి వల్ల సమాజానికి జరిగిన నష్టం, వ్యవస్థాగత లోపాలపై చర్చ జరగాల్సింది పోయి, ప్రజల బలహీనతలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత గాసిప్స్‌ను ప్రధాన వార్తలుగా మార్చడం పతనమవుతున్న జర్నలిజం విలువలకు నిదర్శనం.

Bihar DSP Gautam Kumar | వ్యవస్థ మారాల్సింది ఎక్కడ?

ఒక అధికారి దశాబ్దాల పాటు అవినీతికి పాల్పడుతూ, అంతటా ఆస్తులు కూడబెడుతుంటే.. అంతర్గత నిఘా విభాగాలు (Vigilance) ఏం చేస్తున్నాయనే ప్రశ్న తలెత్తక మానదు.

తనిఖీలు, దాడులు అనేవి కేవలం అవినీతి జరిగాక స్పందించే చర్యలుగానే మిగిలిపోతున్నాయి తప్ప, అవినీతిని ముందుగానే అడ్డుకునే నివారణోపాయాలుగా మారడం లేదు.

అదే సమయంలో, సమాజం కూడా ఒక నేరస్థుడిని చూసి లగ్జరీ కింగ్ అనో.. అతడి వ్యక్తిగత జీవితాన్ని రక్తికట్టించే కథనంగానో చూడటం మానేయాలి. ప్రభుత్వ నిధులను, ప్రజల సొమ్మును దోచుకున్న ఒక ఆర్థిక నేరస్థుడిగా మాత్రమే అతడిని చూడగలిగినప్పుడే.. వ్యవస్థపై, నేరాలపై ప్రజల్లో సరైన అవగాహన ఏర్పడుతుంది.

బీహార్ డీఎస్పీ కేసు అటు ప్రభుత్వ వ్యవస్థల్లో పేరుకుపోయిన అవినీతికి, ఇటు సోషల్ మీడియాలో విస్తరిస్తున్న బాధ్యతారాహిత్యానికి ఒక ఉదాహరణ.

అవినీతి అధికారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఎంత అవసరమో.. సాక్ష్యాధారాలు లేని వ్యక్తిగత పుకార్లను వార్తలుగా వండటంపై అంతకంటే ఎక్కువ సామాజిక విచక్షణ అవసరం.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *