అక్షరటుడే, కామారెడ్డి: TPCC Disciplinary Complaint | కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ డిసిప్లినరీ కమిషన్ ఛైర్మన్ మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
TPCC Disciplinary Complaint | పీసీసీ అధ్యక్షుడు సూచన మేరకే
ఫిర్యాదు లేఖలో.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకే ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌పై గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో వ్యక్తిగత విమర్శలు చేశారని ఆరోపించారు.
నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే ఆయన ఉపయోగించిన పదజాలం బీజేపీ నాయకుల వ్యాఖ్యలను పోలి ఉందని, పరోక్షంగా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

TPCC Disciplinary Complaint | పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా
పార్టీలో కొనసాగుతూనే పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడం, సీనియర్ నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీయడం, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం ద్వారా పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. గతంలో కూడా పలుమార్లు క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదని తెలిపారు.
పార్టీ గౌరవాన్ని, కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని కాపాడేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని కామారెడ్డి జిల్లాలోని పలువురు సీనియర్ నాయకులు, మండల, పట్టణ అధ్యక్షుల తరఫున డిమాండ్ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. సీనియర్ నేతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా ఫిర్యాదుతో జత చేసినట్లు సమాచారం.
ఈ ఫిర్యాదుపై కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ కమిటీ ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Hyderabad Data Centers | ఐటీ హబ్‌గానే కాదు.. డేటా సెంటర్ ‘పవర్ హౌస్’గానూ హైదరాబాద్ జోరు!


