అక్షరటుడే, భీమ్గల్ (ధర్పల్లి): Leopard Death Case | నిజామాబాద్ జిల్లా ధర్పల్లి (Dharpally), భీమ్గల్(Bheemgal) మండలాల పరిధిలో కలకలం రేపిన రెండు చిరుత పులుల మృతి కేసులో అటవీశాఖ అధికారులు (Forest Department) దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
Leopard Death Case | ధర్పల్లి మండల కేంద్రంలో..
ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ పాడుబడిన బావిలో చిరుత కళేబరం లభ్యం కావడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో ఒక చిరుతను చంపి పూడ్చిపెట్టిన ఘటనపై అధికారులు లోతుగా విచారణ జరుపుతుండగా.. ధర్పల్లి మండలంలో జరిగిన మరో చిరుత మృతి ఉదంతం బయటపడింది. రామడుగు అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన వలలో ఓ చిరుత పులితో పాటు అడవి పంది కూడా చిక్కుకున్నట్లు సమాచారం.
Leopard Death Case | బావిలో కళేబరం.. చర్మం ఒలిచి విక్రయం?
వలలో చిక్కుకున్న చిరుతను వేటగాళ్లు దారుణంగా చంపి.. దాని గోళ్లు, దంతాలు, చర్మాన్ని ఒలిచేశారు. అనంతరం కళేబరాన్ని ధర్పల్లి మండల కేంద్ర సమీపంలోని తమ్మలోడి బాగు వద్ద ఉన్న ఒక పాడుబడిన బావిలో పడేశారు.
ఒలిచేసిన పులి చర్మాన్ని అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాడుబడిన బావిలో దాచిపెట్టినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. కాగా, వలలో చిక్కిన అడవి పంది మాంసాన్ని వారు విక్రయించుకున్నట్లు సమాచారం.
Leopard Death Case | నిందితుల గుర్తింపు..
చిరుతను చంపి విక్రయాలకు పాల్పడిన నిందితులను ధర్పల్లికి చెందిన సాంబయ్య, తిరుపతి, సైదులుగా అధికారులు గుర్తించారు. జీవనోపాధి కోసం వచ్చి వీరు మాలగుట్ట పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే వీరిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో రామారెడ్డి ప్రాంతానికి చెందిన మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Leopard Death Case | క్షేత్రస్థాయిలో జాగిలాలతో తనిఖీలు
చిరుతను చంపి దాదాపు మూడు నెలలు అవుతున్నా అటవీ శాఖ అధికారులు తెలుసుకోకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు యథేచ్ఛగా ఉచ్చులు వేసి వన్యమృగాలను వేటాడుతున్నారు. కొందరు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మహేష్ భట్ అటవీ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. జాగిలాల (డాగ్ స్క్వాడ్) సాయంతో ఆధారాలు సేకరించారు.
కళేబరాలు లభ్యమైన బావుల చుట్టూ రక్షణ రిబ్బన్లు కట్టి గుర్తులు ఏర్పాటు చేశారు. నిందితుల నుంచి పులి గోళ్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నామని, పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని రేంజ్ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: గురుగ్రామ్–ద్వారకా ఎక్స్ప్రెస్వే టన్నెల్లో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.