అక్షరటుడే, కామారెడ్డి:Telangana Formation Day | అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలుగా జిల్లాలో పాలన సాగుతోందని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా (Kamareddy District) కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
వీహెచ్ మొదట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో గడిచిన 99 రోజుల్లోనే జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కింద 10 రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. పారిశుధ్యం, ఆరోగ్యం, అర్బన్-అలైవ్, సంక్షేమం, బాలల భద్రత, వ్యవసాయం, విద్య, యువత-క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణం రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జిల్లాలో 9,448 ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపనలు చేయగా 5,386 భవనాలకు పైకప్పుల నిర్మాణం పూర్తయిందని, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాల ద్వారా 4,170 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
Telangana Formation Day | విద్యా, వైద్య రంగాలకు..
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో 18,455 మందికి రూ.49 కోట్లతో వైద్యం అందించామని హనుమంతరావు వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి రూ.27.82 కోట్లు ఖర్చు చేశామని, పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందికి రూ.10 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లోని 5,513 మందికి రూ.3.73 కోట్ల ఉపకార వేతనాలు, 3,419 మందికి 1.60 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేశామని పేర్కొన్నారు.
Telangana Formation Day | ఉచిత విద్యుత్
గృహ జ్యోతి కింద జిల్లాలో 1,73,803 మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ.137.81 కోట్లు, వ్యవసాయానికి 1,17,667 పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కింద 11,616 మంజూరు చేయగా.. 10,848 ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. రూ.226.14 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
Telangana Formation Day | రైతులకు..
యాసంగి సీజన్లో 4.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించి ఇప్పటివరకు రూ.839.48 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. రైతు బీమా కింద 627 మంది నామినీలకు రూ.31.35 కోట్లు, రైతు భరోసా (Rythu Bharosa) కింద 3,09,281 మందికి రూ.220.30 కోట్లు అందించామని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా సహకారంతో కామారెడ్డిని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని హన్మంత్ రావు స్పష్టం చేశారు.
Telangana Formation Day | ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన
పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. దోమకొండకు చెందిన ఇద్దరు విద్యార్థులు చేసిన విలువిద్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విలువిద్య ప్రదర్శనకు ముగ్దులైన ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు విద్యార్థులకు రూ.50 వేలు నగదు పురస్కారం ప్రకటించారు. రెండవ విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఇటీవల చిరుతపులి దాడిలోపశువులను కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందజేశారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవా పథకాలు పొందిన సిబ్బందికి పత్రాలను అందజేశారు. అనంతరం సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Indiramma Housewarming 1 | ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం


