Flex Fuel WagonR | మారుతి వ్యాగన్ ఆర్ కొత్త చరిత్ర!.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారుగా రికార్డు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Flex Fuel WagonR | భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మారుతి సుజుకీ ఇండియా (Maruti Suzuki India) తన తొలి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారు ‘వ్యాగన్ ఆర్’ను లాంచ్ చేసింది.

ఇది దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారు కావడం గమనార్హం. పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై కూడా పనిచేసే సామర్థ్యం కలిగిన ఈ వర్షన్.. దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు.

Flex Fuel WagonR | ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు..

Flex Fuel WagonR

మన దేశం ఇంధన కోసం విదేశాలపై ఆధారపడి ఉంది. దీంతో దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను పెంచుతూ వస్తోంది. దీనికి మారుతి సుజుకీ ఇండియా సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారును తీసుకొచ్చింది. ఇథనాల్ వినియోగం వల్ల ఇంధన దిగుమతుల భారం తగ్గడమే కాకుండా, కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది.

Flex Fuel WagonR | ప్రత్యేకత ఏమిటంటే..

మారుతి సుజుకీ అభివృద్ధి చేసిన ఈ ఫ్లెక్స్ ఫ్యుయల్ వ్యాగన్ ఆర్ వివిధ రకాల ఇథనాల్ , పెట్రోల్ మిశ్రమ ఇంధనాలపై సులభంగా నడవగలదు. ఈ కారులో అమర్చిన అధునాతన ఈసీయూ (ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ).. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం ఎంత ఉన్నా, పూర్తిగా ఇథనాల్‌నే ఇంధనంగా వాడినా.. దానికి అనుగుణంగా ఇంజిన్ పనితీరును సొంతంగా మార్చుకుంటుంది. అంటే ఈ వాహనం స్వచ్ఛమైన ఇథనాల్‌తో పాటు ఇ20 నుంచి ఇ85 వరకు ఉన్న మిశ్రమ ఇంధనాలను కూడా సమర్థంగా ఉపయోగించగలదు. ఇంధనంలో 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ ఉన్నా, ఇంజిన్ పనితీరులో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న మాట.

Flex Fuel WagonR | రూ.1.84 లక్షల కోట్ల విదేశీ మారకపు ద్రవ్యం ఆదా..

Flex Fuel WagonR

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని 2014లో ప్రారంభించారు. మొదట్లో 1.5 శాతం కలిపేవారు. దీనిని క్రమంగా పెంచుతూ ప్రస్తుతం 20 శాతానికి తీసుకువచ్చారు. ఇలా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల ఇప్పటివరకు 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురు దిగుమతులు తగ్గాయని.. తద్వారా రూ. 1.84 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యిందని కేంద్రం చెబుతోంది. యూరో-6 ప్రమాణాల వాహనాలను ఇ100కు అనుకూలంగా మార్చడం ద్వారా చమురు దిగుమతి భారాన్ని మరింత తగ్గించవచ్చని పేర్కొంటోంది.

ఇది కూడా చదవండి..: Infinix Smart 20 | ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *