అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Spa Raids |నగరంలో మసాజ్ సెంటర్లు, స్పాల పేరిట సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ ( Hyderabad) పోలీసులు రంగంలోకి దిగారు. పైకి హెల్త్, బ్యూటీ కేర్ బోర్డులు తగిలించి.. లోపల యథేచ్ఛగా వ్యభిచార ముఠాలను నడుపుతున్న కేంద్రాలపై ఖాకీలు నిఘా పెట్టారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటం, పోలీసులు ఎన్ని దాడులు చేసినా నిర్వాహకుల తీరు మారకపోవడంతో ఈసారి గట్టి యాక్షన్‌కు ప్లాన్ చేశారు.

Hyderabad Spa Raids | 113 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు..
ఈ క్రమంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. వందల మంది పోలీసు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 113 స్పా సెంటర్లపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ ఆకస్మిక తనిఖీలలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనల ప్రకారం కస్టమర్ల పూర్తి వివరాలు నమోదు చేయాల్సిన రిజిస్టర్లను చాలా సెంటర్లలో నిర్వహించడం లేదని పోలీసులు గుర్తించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ నడుపుతున్న పలు స్పా నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

Hyderabad Spa Raids | భవన యజమానులకూ తప్పని తిప్పలు..
ఈ దాడుల్లో పోలీసులు కేవలం నిర్వాహకులనే కాకుండా, ఆయా స్పా సెంటర్లకు భవనాలను అద్దెకు ఇచ్చిన ఓనర్లను కూడా టార్గెట్ చేశారు. తమ బిల్డింగులలో ఎలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయనే విషయాన్ని పట్టించుకోని యజమానులపై విచారణ ప్రారంభించారు. అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ పోలీసులకు కనీస సమాచారం ఇవ్వని భవన ఓనర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు.
మసాజ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం కమిషనరేట్ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయని, పట్టుబడిన స్పా సెంటర్ల పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: KA Paul Counter | పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ కౌంటర్
