Green Water Tankers | నీటి ఎద్దడి నివారణకు చర్యలు.. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం

హైదరాబాద్​ నగరంలో గ్రీన్​ వాటర్​ ట్యాంక్​ సేవలను జలమండలి అధికారులు ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Water Tankers | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి (HMWSSB) అధికారులు చేపట్టారు. ఈ మేరకు గ్రీన్​ వాటర్​ టాంకర్ల సేవలను ఆదివారం ప్రారంభించారు. జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం సచివాలయంలో గ్రీన్​ వాటర్​ ట్యాంక్​లను అధికారులు ప్రారంభించారు.

నగర ప్రజలకు నల్లాల ద్వారా జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. అంతేగాకుండా ట్యాంకర్ల ద్వారా సైతం తాగునీరు అందజేస్తోంది. అంతేగాకుండా ప్రజలు ప్రైవేట్​ ట్యాంకర్లను సైతం ఆశ్రయిస్తున్నారు. అయితే ఎల్​నినో ప్రభావంతో నగరానికి నీరు సరఫరా చేసే జలశయాల్లో నీటిమట్టం భారీగా పడిపోయింది. దీంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా శుద్ధి చేసిన నీటిని గృహ అవసరాలకు కాకుండా, ఇతర పనులకు వినియోగించాలని ప్రణాళిక రూపొందించింది.

Green Water Tankers | ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు

హైదరాబాద్​ నగరంలో అనేక మురుగు నీటి శుద్ధి (STP) కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నీటిని శుద్ధి చేసి గతంలో సమీపంలోని జలాశయాల్లో వదిలేవారు. అయితే ఆ నీటిని ఇక నుంచి మళ్లీ వినియోగించనున్నారు. నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్, పార్కుల నిర్వహణ తదితర తాగేతర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టినట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ శాఖలు, పార్కులు, పచ్చదనం నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు పక్కన, డివైడర్లు, పార్కుల్లో మొక్కలకు గతంలో తాగునీటినే వినియోగించేవారు. ఇక నుంచి వాటికి శుద్ధి చేసిన నీటిని వాడనున్నారు. ఈ వాటర్​ కోసం ప్రత్యేకంగా గ్రీన్​ ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చారు.

Green Water Tankers | తొలివిడతలో 28 ట్యాంకర్లు

నగరంలోని 19 ఎస్టీపీల నుంచి తొలివిడతలో 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనున్నారు. అత్తాపూర్, అంబర్‌పేట్, నాగోల్, కోకాపేట్, గోపన్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, దశలవారీగా నగరవ్యాప్తంగా విస్తరించనున్నారు. గ్రీన్ వాటర్ సరఫరా కోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ప్రైవేటు సంస్థలకు చెందిన సుమారు 100 ట్యాంకర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నీరు తాగడానికి, ఇతర గృహ అవసరాలకు పనికి రాదు.

దీనిని కూడా చదవండి : Delhi Pollution | ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం.. వర్క్​ ఫ్రమ్​ హోమ్​పై కీలక ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *