అక్షరటుడే వెబ్‌డెస్క్: AI Soft Robots | రోబోటిక్ టెక్నాలజీ అనగానే మనకు సాధారణంగా మనుషుల్లా నడిచే హ్యూమనాయిడ్లు లేదా ఫ్యాక్టరీలలో పనిచేసే భారీ యంత్రాలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ, ఇప్పుడు మానవ అవసరాల కోసం సరిహద్దులను దాటి సరికొత్త పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణ కొరియాకు ( South Korea ) చెందిన సాంకేతిక నిపుణులు.. భూగర్భంలో, భవనాలలో ఉండే పైప్‌లైన్ల అంతర్గత సమస్యలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చిన్న సాఫ్ట్ రోబోలను తయారు చేస్తున్నారు.

AI Soft Robots | ‘ఈల్’ చేపల స్ఫూర్తితో..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న పైప్ ఇన్‌స్పెక్షన్ రోబోల వల్ల పెద్ద సమస్యే ఉంది. పైపుల్లో ఎక్కడైనా బ్లాక్ అయినా లేదా లీక్ అయినా.. రోడ్లను, నేలను భారీగా తవ్వి ఆ ప్రదేశాన్ని ఇన్‌స్పెక్షన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల సమయంతో పాటు ప్రజా ధనం, వనరులు తీవ్రంగా వృథా అవుతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు నీటిలో ఈదే ‘ఈల్’ (ఒక రకమైన చేప) శరీర నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సాఫ్ట్ రోబోలను డిజైన్ చేశారు. ఇవి చాలా మెత్తని పదార్థాలతో తయారవడం వల్ల ఇరుకైన, వంకరగా ఉన్న , వ్యర్థాలతో నిండిపోయిన పైపుల్లో కూడా ప్రవాహానికి అనుగుణంగా తమ ఆకారాన్ని మార్చుకుంటూ సులభంగా ముందుకు సాగగలవు.
AI Soft Robots | పగుళ్లు, లీకేజీలను పట్టేస్తాయి..
మానవులు వెళ్ళడానికి వీల్లేని, అత్యంత ప్రమాదకరమైన భూగర్భ గ్యాస్, వాటర్, ఇండస్ట్రియల్ పైప్‌లైన్లలో ఈ స్మార్ట్ రోబోలు అద్భుతంగా పనిచేస్తాయి. పాతగా అయిన పైపుల లోపల ఏర్పడే అతిచిన్న పగుళ్లను, గ్యాస్ లేదా వాటర్ లీకేజీలను ఇవి స్వయంగా గుర్తించి తక్షణమే సమాచారాన్ని అందిస్తాయి. దీనివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా ముందే అడ్డుకోవచ్చు.

AI Soft Robots | ఏఐ సెన్సార్లు, కెమెరాలతో రిపేరింగ్..
ఈ బుల్లి సాఫ్ట్ రోబోలలో అత్యాధునిక ఏఐ సెన్సార్లు, హై-రిజల్యూషన్ కెమెరాలతో పాటు చిన్నపాటి రిపేరింగ్ టూల్స్‌ను కూడా అమర్చారు. ఇవి పైపుల లోపలి అసలు పరిస్థితిని స్పష్టమైన విజువల్స్ ద్వారా లైవ్‌లో తెలియజేయడమే కాకుండా, లీకేజీలను వెంటనే రిపేర్ చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుతం ఈ సరికొత్త టెక్నాలజీ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నగరాల్లో నీటి వృథాను అరికట్టడానికి, మౌలిక వసతుల సంరక్షణకు ఇదొక గేమ్ ఛేంజర్ కానుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి: Giant Fish Catch | గంగపుత్రులకు చిక్కిన భారీ చేప
