అక్షరటుడే వెబ్‌డెస్క్: Aprilia SXR GT Scooters | ప్రీమియం స్కూటర్ల విభాగంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘ఏప్రిలియా’ (Aprilia) సరికొత్త ‘ఎస్‌ఎక్స్‌ఆర్ జీటీ’ (SXR GT) శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. సోమవారం సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, టూ వీలర్ డొమెస్టిక్ బిజినెస్ హెడ్ అజయ్ రఘువంశీ సమక్షంలో ఈ కొత్త స్కూటర్లను అధికారికంగా ఆవిష్కరించారు.
Aprilia SXR GT Scooters | డిజైన్ , పనితీరు..
ఈ సందర్భంగా పియాజియో వెహికల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రాఫీ మాట్లాడుతూ.. భారత ( India ) స్కూటర్ మార్కెట్లో ప్రీమియం వాహనాలకు ఆదరణ వేగంగా పెరుగుతుందన్నారు. వినియోగదారుల కోరిక మేరకు అత్యుత్తమ పనితీరు, సౌకర్యం, సాంకేతికతతో పాటు ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ కొత్త శ్రేణిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. నగరాల్లో రోజూవారీ ప్రయాణాలతో పాటు దూర ప్రయాణాలకు కూడా ఇవి ఎంతో అనువుగా ఉంటాయని పేర్కొన్నారు.
Aprilia SXR GT Scooters | రెండు వేరియంట్లుగా ..
ఈ శ్రేణిలో కంపెనీ ఎస్‌ఎక్స్‌ఆర్ జీటీ 125, ఎస్‌ఎక్స్‌ఆర్ జీటీ 175 పేరిట రెండు మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణలో ఎస్‌ఎక్స్‌ఆర్ జీటీ 125 ధర రూ. 1,10,374 కాగా, ఎస్‌ఎక్స్‌ఆర్ జీటీ 175 ధర రూ. 1,30,374గా నిర్ణయించారు. 125 సీసీ మోడల్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో 7.8 కిలోవాట్ల శక్తిని, 10.4 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. ఇందులో 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ముందు డిస్క్ – వెనుక డ్రమ్ బ్రేకులు ఇచ్చారు. ఇక 175 సీసీ మోడల్ 9.76 కిలోవాట్ల శక్తిని, 14.14 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్/మ్యూజిక్ కంట్రోల్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయం ఉన్నాయి. అంతేకాకుండా ముందు చక్రానికి ఏబీఎస్, 220 ఎంఎం డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఈ రెండు మోడళ్ల ఇంజిన్లు బీఎస్-6 ఓబీడీ-2 స్టేజ్-2 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడి, ఈ20 ఇంధనంతోనూ పనిచేస్తాయి.
Aprilia SXR GT Scooters | డీలర్‌షిప్ బుకింగ్స్..
ఈ రెండు స్కూటర్లు మొత్తంగా ఆరు ఆకర్షణీయమైన రంగుల ఎంపికలో లభిస్తున్నాయి. మ్యాటీ బ్లాక్, గ్లోసీ అజురో, గ్లోసీ వైట్ రంగుల్లో ఎస్‌ఎక్స్‌ఆర్ జీటీ 125 లభిస్తుండగా.. మెటాలిక్ బ్లూ, మ్యాటీ బ్లాక్, మ్యాటీ గ్రీన్ రంగుల్లో 175 సీసీ మోడల్ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏప్రిలియా డీలర్‌షిప్‌లలో ఈ కొత్త స్కూటర్ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సంస్థ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Eagle Force Raid | ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్