అక్షరటుడే వెబ్‌డెస్క్: Pride@Godrej 2026 | సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, సమ్మిళిత వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ( Godrej Industries ) తమ ప్రధాన కార్యాలయం ‘గోద్రెజ్ వన్’లో ‘ప్రైడ్@గోద్రెజ్ 2026’ వేడుకలను వైభవంగా నిర్వహించింది. ఎల్‌జీబీటీక్యూఐఏ+ (LGBTQIA+) వర్గాల హక్కులు, వారిని సమాజంలో అందరితో పాటు ఎలా సమానంగా కలుపుకొని పోవాలనే విషయంపై చర్చించడానికి ఉద్యోగులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు ఒకే వేదికపైకి వచ్చారు.”
Pride@Godrej 2026 | ఉత్సాహంగా సాగిన ‘ప్రైడ్ మార్చ్’..
గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (GCPL) సీఈఓ సుధీర్ సీతాపతి నేతృత్వంలో జరిగిన వార్షిక ‘ప్రైడ్ మార్చ్’తో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. కంపెనీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని క్వీర్ వర్గానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సుధీర్ సీతాపతి ‘ప్రైడ్ ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ టూల్‌కిట్’ను ఆవిష్కరించారు. ఉత్పత్తి (Manufacturing) , ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) రంగాల్లో పని చేసే LGBTQIA+ ఉద్యోగులకు ఎలాంటి వివక్ష లేని, సురక్షితమైన ఆఫీస్ వాతావరణాన్ని అందించడానికి ఈ గైడ్ ఉపయోగపడుతుంది.
Pride@Godrej 2026 | కువైర్ ఇండియా నౌ ..
ఈ వేడుకల్లో భాగంగా ‘కువైర్ ఇండియా నౌ!’ అనే సరికొత్త పుస్తకాన్ని విడుదల చేశారు. వెస్ట్‌ల్యాండ్ ప్రచురణ సంస్థ , గోద్రెజ్ డీఈఐ ల్యాబ్ (Godrej DEI Lab) సంయుక్తంగా ‘కువైర్ డైరెక్షన్స్’ సిరీస్ కింద ఈ ఆంథాలజీని తీసుకొచ్చాయి. ప్రముఖ జర్నలిస్టులు ధ్రుబో జ్యోతి, ధామిని రత్నం ఎడిటర్లుగా వ్యవహరించిన ఈ పుస్తకంలో.. దేశంలోని క్వీర్ వ్యక్తుల నిజ జీవిత అనుభవాలు, వారి అస్థిత్వం , సమాజంలో వారి ఉనికిని ప్రతిబింబించే విభిన్న కథనాలను పొందుపరిచారు. భవిష్యత్తులో క్వీర్ లీడర్లను తీర్చిదిద్దేందుకు వీలుగా గోద్రెజ్ ఫౌండేషన్, గోద్రెజ్ డీఈఐ ల్యాబ్ కలిసి ‘కువైర్ ఇండియా ఫెలోషిప్’ను ప్రకటించాయి. ఏడాది పాటు సాగే ఈ వినూత్న ప్రోగ్రామ్ ద్వారా, క్వీర్ యువతకు వివిధ రంగాల నిపుణులతో మెంటర్ షిప్, ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా ఇప్పటివరకు క్వీర్ వర్గాల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న రంగాలపై ఈ ఫెలోషిప్ ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
Pride@Godrej 2026 | ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఏ.పి. షా..
ఈ వేడుకలకు ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.పి. షా ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమ్మిళిత సమాజ నిర్మాణంలో రాజ్యాంగ విలువల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. క్వీర్ వర్గాలకు సమాజంలో మరింత గౌరవం, సమాన హక్కులు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్వీర్ సాహిత్య పఠనం, క్వీర్ బజార్ , ప్రత్యేక హైరింగ్ బూత్ (ఉద్యోగ అవకాశాల వేదిక) ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంస్థలు, కమ్యూనిటీలు పరస్పర అవగాహనతో ముందుకు వచ్చినప్పుడే నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని గోద్రెజ్ డీఈఐ ల్యాబ్ హెడ్ పరమేష్ షహానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ పబ్లిషర్ కార్తీక మాట్లాడుతూ.. గోద్రెజ్ డీఈఐ ల్యాబ్‌తో కలిసి సమాజానికి ఉపయోగపడే ఇలాంటి అద్భుతమైన పుస్తకాలను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
Pride@Godrej 2026 |తమిళనాడు ప్లాంట్‌లో ‘ట్రాన్స్‌కేఫ్’..
జూన్ నెల పొడవునా ఈ ప్రైడ్ వేడుకలను దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా గోద్రెజ్ విస్తరించనుంది. ఇందులో భాగంగా తమిళనాడులోని చెంగల్‌పట్టులో ఉన్న గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్లాంట్‌లో ‘ప్రైడ్ మార్చ్’ నిర్వహించడంతో పాటు, పూర్తిగా క్వీర్ వర్గాల వారే నడిపే ‘ట్రాన్స్‌కేఫ్’ (Transcafe) అనే ప్రత్యేక కేఫ్‌ను ప్రారంభించనున్నారు. కంపెనీలోని అన్ని విభాగాలు కలిసి క్వీర్ వర్గాల వారికి ఉపాధి కల్పన, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ వంటి పలు కార్యక్రమాలను ఉమ్మడిగా చేపట్టనున్నాయి.
ఇది కూడా చదవండి: Anganwadi Salaries | అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలి: హరీశ్‌రావు
