అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Police Martyrs | ప్రజల రక్షణ , సమాజ శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ గోషామహల్ పరేడ్ మైదానంలో బుధవారం నిర్వహించిన ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి సీఎం అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.
Telangana Police Martyrs | అభివృద్ధికి మూలాధారం..
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 155 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వచ్చి అభివృద్ధి వేగంగా జరుగుతుందని, కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను పుణికిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తోందని కొనియాడారు.
Telangana Police Martyrs | 2028 నాటికి ఖాళీలన్నీ భర్తీ..
పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను సీఎం వివరించారు. 4,773 కానిస్టేబుల్ పోస్టులతో సహా మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చామని, 2028 నాటికి పోలీసు శాఖలోని అన్ని ఖాళీలను విడతల వారీగా భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే 112 మంది డీఎస్పీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి హోదాను బట్టి ఎక్స్‌గ్రేషియాను రూ. కోటికి పైగా పెంచినట్లు వెల్లడించారు. పోలీసు ఉద్యోగుల పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేశామని, అలాగే హోంగార్డుల కుటుంబాలకు కూడా మెరుగైన వైద్య భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
Telangana Police Martyrs | నేరస్థుల పట్ల కఠినంగా ఉండాలి..
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిలో పోలీసు శాఖ పనితీరు అద్భుతంగా ఉందని, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని సీఎం కొనియాడారు. ఆహార కల్తీని అరికట్టేందుకు ‘టీజీ సేఫ్’ (TG-SAFE) ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో ట్రాన్స్‌జెండర్లను భాగస్వాములను చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు.
“బాధితులు, సామాన్యులు , అమాయకుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. కానీ నేరస్థులు, భూకబ్జాదారులు, డ్రగ్స్ విక్రయించే ముఠాల పట్ల ఉక్కుపాదం మోపాలి. సాంకేతికత ఎంత పెరిగినా పోలీసు వ్యవస్థలో మానవీయ కోణం తగ్గకూడదు” అని సీఎం హెచ్చరించారు.
పిల్లలకు ఉత్తమవిద్య కోసం పోలీస్ స్కూల్..
హోం గార్డ్ నుంచి డీజీపీ వరకు ప్రతి పోలీస్ కుటుంబం పిల్లలకు మంచి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ద్వారా అందరికీ అవకాశం కల్పిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ప్రాంతంలో 44 ఎకరాల్లో నిర్మించిన పోలీస్ స్కూల్‌ను ప్రారంభించుకున్నామన్నారు.
#policefamilies #revanthreddy #qualityeducation #manchirevula #telangananews #aksharatoday
— Akshara Today | Telugu News (@AksharaToday) October 21, 2026
ఇది కూడా చదవండి: Indian Stock Market | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాల బాటలో సూచీలు