అక్షరటుడే వెబ్‌డెస్క్: RBI Repo Rate | దేశంలో ఎల్‌నినో ప్రభావం , పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అప్రమత్తమైంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
వరుసగా 21 మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశాల్లో వడ్డీ రేట్లను ఎటువంటి మార్పు లేకుండా కొనసాగించిన ఆర్బీఐ.. అక్టోబర్ 7న (బుధవారం) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, 2023 ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా ఆర్బీఐ రెపో రేటును పెంచినట్లవుతుంది. క్రూడాయిడ్ ధరల భారం, గ్లోబల్ మార్కెట్లలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, రూపాయి విలువపై నిరంతరం పడుతున్న ఒత్తిడి వంటి అంశాలు ఆర్బీఐకి పెద్ద సవాళ్లుగా మారాయి.
RBI Repo Rate | మార్కెట్ల అంచనాలు..
రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉండొచ్చని మార్కెట్లు ఇప్పటికే గట్టిగా నమ్ముతున్నాయి. అయితే, అసలు ఆసక్తి రేట్ల పెంపు ఎంత అన్నదానికంటే.. రాబోయే రోజుల్లో ఆర్బీఐ అనుసరించబోయే విధానం, ద్రవ్యోల్బణంపై దాని అంచనాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (నగదు లభ్యత) నిర్వహణ ఎలా ఉంటుందనే దానిపైనే ఉంది. ఆర్బీఐ వైఖరి ఇప్పటివరకు ‘న్యూట్రల్’గా ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భవిష్యత్తులో మరింత కఠినమైన లేదా హాకిష్ వైఖరిని అవలంబిస్తుందా అనేదానిపై మార్కెట్ వర్గాలు నిశితంగా దృష్టి పెట్టాయి.
RBI Repo Rate | ద్రవ్యోల్బణ అంచనాలు ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ధరల పెరుగుదల 5 శాతం దాటకుండా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది.” అయితే, కమోడిటీస్ , ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఈ అంచనాను మళ్లీ సవరించాల్సి వస్తుందా లేదా అనేది చూడాలి. ఇటీవల ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి పెరిగింది (జులైలో ఇది 4.45%). దేశీయ పరిస్థితులు కొంతమేర సర్దుకుంటున్నప్పటికీ, 2026-27 నాటికి సీపీఐ ద్రవ్యోల్బణం 5.2 శాతానికి చేరవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రూడాయిడ్ ధరల మంట సరఫరా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుండటం ఆర్బీఐకి సవాలుగా మారింది.
మొత్తంగా చూస్తే, ఆర్బీఐ ఈసారి 25 బేసిస్ పాయింట్ల పెంపుతో వడ్డీ రేట్ల పెంపు ప్రయాణాన్ని ప్రారంభించేలా కనిపిస్తోంది. ఆ తర్వాత ఎన్ని విడతల్లో రేట్లు మారుస్తారు? వృద్ధిని, లిక్విడిటీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అనే అంశాలపైనే దేశ ఆర్థిక మార్కెట్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ఇది కూడా చదవండి: Cooperative Society Appointments | సహకార సంఘాల్లో ‘నామినేటెడ్’ నియామకాలు.. బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్లు