అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Socio Economic Analysis | హైదరాబాద్‌లోని నైజాం Nizam కళాశాల ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అక్టోబరు 6, 2026న “Telangana Socio-Economic Analysis” అనే అంశంపై వన్-డే సింపోజియం నిర్వహించారు. ఈ సింపోజియంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోని వివిధ అంశాలపై అధ్యాపకులు, ఆర్థికవేత్తలు తమ విశ్లేషణలను అందించారు.
ఈ సందర్భంగా ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఎం. ఏ. మాలిక్, “ఆర్థిక సమస్యల సామాజిక–ఆర్థిక విశ్లేషణ ప్రాధాన్యం” అనే అంశంపై ప్రసంగించారు. ఆర్థిక సమస్యలను కేవలం ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి, ధరలు, వృద్ధిరేట్లు వంటి గణాంకాల ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోవడం పరిపూర్ణం కాదని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక సమస్యల వెనుక ఉన్న సామాజిక వాస్తవాలను, సామాజిక నిర్మాణాన్ని, కులం, లింగం, విద్య, ఆరోగ్యం, పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలను అర్థం చేసుకున్నప్పుడే ఆర్థిక సమస్యల స్వభావాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగలమని ఆయన వివరించారు.
Telangana Socio Economic Analysis | సమగ్ర అభివృద్ధి, అవకాశాల కోసం
సమాజంలోని వివిధ వర్గాలకు ఆర్థిక వృద్ధి సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలించడం సామాజిక–ఆర్థిక విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. ముఖ్యంగా “ఆర్థిక వృద్ధి ఎంత జరిగింది?” అనే ప్రశ్నతో పాటు “ఆ వృద్ధి వల్ల ఎవరు లాభపడ్డారు? ఎవరు వెనుకబడ్డారు? అవకాశాలు ఏ వర్గాలకు ఎంత మేరకు అందుతున్నాయి?” అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ఇలాంటి విశ్లేషణ అవసరమని ఆయన స్పష్టం చేశారు.
Telangana Socio Economic Analysis | తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో రంగాల వారీ అభివృద్ధి
ప్రొఫెసర్ మాలిక్ తన ప్రదర్శనలో 2014-15 నుంచి 2025-26 వరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో జరిగిన రంగాల వారీ మార్పులు, అభివృద్ధిని కూడా విశ్లేషించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల GSDPలో.. వాటా, వాటి వృద్ధి ధోరణులు, ఉపాధిపై ప్రభావం, రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో చోటుచేసుకున్న మార్పులను వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పులను పరిశీలిస్తూ.. వ్యవసాయ రంగం ప్రాధాన్యం, పారిశ్రామిక రంగం విస్తరణ, సేవల రంగం ఆధిపత్యం, ఉపాధి నిర్మాణంలో వచ్చిన మార్పుల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. కేవలం GSDP వృద్ధిని కాకుండా రంగాల వృద్ధి, ఉపాధి సృష్టి, ఆదాయ పంపిణీ, సమ్మిళిత అభివృద్ధి కోణాల నుంచి తెలంగాణ ఆర్థిక ప్రగతిని అంచనా వేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
Telangana Socio Economic Analysis | పుస్తక బహూకరణ
ప్రొఫెసర్ ఎం. ఏ. మాలిక్ రచించిన “The Process of Inclusive Development in India: A Critical Appraisal” పుస్తకాన్ని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు బహూకరించారు. భారతదేశంలో సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, అసమానతలు, అభివృద్ధి ప్రక్రియకు సంబంధించిన అంశాలను విశ్లేషించే ఈ పుస్తకాన్ని ఆయనకు అందజేశారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఈ సింపోజియం తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక గణాంకాలు, సామాజిక వాస్తవాలు, విధానపరమైన అంశాలను సమన్వయం చేస్తూ సమగ్ర చర్చకు వేదికగా నిలిచింది. తెలంగాణ అభివృద్ధిని మరింత సమ్మిళితంగా, సమానత్వపూర్వకంగా, సామాజిక న్యాయ దృక్పథంతో ముందుకు తీసుకెళ్లడానికి ఇటువంటి శాస్త్రీయ చర్చలు ఎంతో అవసరమని ప్రొఫెసర్ మాలిక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం. ఏ. మాలిక్‌ను వక్తలు ఘనంగా సన్మానించారు.