అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Rain Traffic | హైదరాబాద్‌లో ( Hyderabad ) జూన్ 9న కురిసిన వర్షం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. కేవలం గంట సేపు కురిసిన వర్షానికే ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో, సాధారణంగా 20 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులకు ఏకంగా 6 గంటల సమయం పట్టింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే క్రమంలో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసు వేళలు పూర్తయ్యాక ఒకేసారి జనం రోడ్లపైకి రావడం, పలు రహదారులు జలదిగ్బంధనం కావడం, ట్రాఫిక్ జామ్.. ఇలా రకరకాల కారణాలతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రైల్వే స్టేషన్లు సైతం కిటకిటలాడిన పరిస్థితి కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Hyderabad Rain Traffic | మెట్రోలో రద్దీ..
రోడ్లపై వాహనాలు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడటంతో, చాలామంది ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రైళ్లలో చోటు దొరకక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో రైళ్లలో కూడా రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Hyderabad Rain Traffic | ఐటీ కారిడార్‌లో అధ్వాన్న పరిస్థితి..
నగరంలో ఐటీ రంగానికి కీలకమైన హైటెక్ సిటీ, రాయదుర్గం, కోకాపేట ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. అనేక హైరైజ్ బిల్డింగ్లు కడుతున్న ఈ ప్రాంతంలో చిన్నపాటి వర్షానికే రోడ్లపై మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోవడంపై స్థానికులు, ఐటీ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే ఈ ప్రాంతాల్లో, కనీస డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం , వరద నీటిని మళ్లించే మార్గాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Hyderabad Rain Traffic | ప్రజల ఆందోళన..
ప్రజలకు ఇబ్బందులు తొలగించేందుకు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. అయినా సరైన ప్రణాళికలు లేని మురుగు, వరద నీటి పారుదల వ్యవస్థ ఉండటంతో ప్రభుత్వం చర్యలు ఆశించిన మేర ఫలితాలను ఇవ్వట్లేదు. భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ ముంపునకు గురవుతుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల సమన్వయంతో వరద నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Vizag Steel Plant Accident | స్టీల్ ప్లాంట్లో వరుస ప్రమాదాలు.. ప్రభుత్వ తీరుపై జగన్ ఫైర్
