అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Bengaluru High Speed Rail | హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాథమిక సర్వే కొలిక్కి వచ్చింది. కోకాపేట నుంచి మన్ననూరు, సోమశిల మీదుగా వెళ్లే మార్గాన్ని గుర్తించగా తెలంగాణలో ఐదు స్టేషన్లు ప్రతిపాదించారు.
దేశవ్యాప్తంగా పలు హైస్పీడ్ రైలు కారిడార్లకు గతంలో కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్ నుంచి వెళ్లే మ మార్గాలు సైతం ఉన్నాయి. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–ముంబై, హైదరాబాద్–చెన్నై మార్గాల్లో హైస్పీడ్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హైదరాబాద్–బెంగళూరు కారిడార్ కోసం అధికారులు సర్వే చేశారు. రెండు ఐటీ నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ప్రాథమిక ఎలైన్‌మెంట్ సర్వే ప్రక్రియ దాదాపు కొలిక్కి వస్తోంది.
Hyderabad Bengaluru High Speed Rail | 205 కిలోమీటర్లు..
ఈ హైస్పీడ్ కారిడార్ (High-Speed Corridor) ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాల మీదుగా సాగనుంది. నల్లమల అటవీ అందాల మధ్యలోనుంచి కొత్త కారిడార్ నిర్మించనున్నారు. ఈ కారిడార్ తెలంగాణలో ప్రారంభమై, ఏపీ మీదుగా సాగుతూ.. బెంగళూరులో ముగుస్తుంది. ఈ ప్రాజెక్టులో తెలంగాణలో పరిధిలో 205 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మించనున్నారు. శంషాబాద్, మహబూబ్నగర్, కర్నూల్ మీదుగా ట్రాక్ నిర్మించాలని మొదట నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ భావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. రైలు సదుపాయం లేని ప్రాంతాల మీదుగా బుల్లెట్ రైలు మార్గాన్ని తీసుకెళ్లాలని సూచించింది. శంషాబాద్, మన్ననూరు-శ్రీశైలం, సోమశిల రూట్ వైపే ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ సైతం మొగ్గు చూపింది. దీంతో ఈ కారిడార్ కోకాపేటలో ప్రారంభం అయి శంషాబాద్, నల్లమల మీదుగా కర్నూలుకు కనెక్ట్ అవుతుంది.
Hyderabad Bengaluru High Speed Rail | స్టేషన్లు ఇవే..
ఈ హైస్పీడ్ రైలు కారిడార్లో తెలంగాణ (Telangana) పరిధిలో ఐదు అత్యాధునిక రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు. శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమన్‌గల్లు, పర్యాటక ప్రాంతాలైన మన్ననూరు, సోమశిలలను స్టేషన్లుగా గుర్తించారు. బుల్లెట్ రైలు కారిడార్, స్టేషన్ల ఏర్పాటుతో ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేగాకుండా ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం చాలా తగ్గనుంది. డీపీఆర్ ఆమోదం పొందిన అనంతరం అధికారులు భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి..: Tirupati Minor Assault | దారుణం.. 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ లైంగిక దాడి


