అక్షరటుడే వెబ్‌డెస్క్: Medigadda Project Repairs | మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులను 2027 ఎండాకాలం నాటికి పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించేలా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy )తెలిపారు. బుధవారం ఆయన మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పునరుద్ధరణ పరీక్షలను స్వయంగా పరిశీలించారు.
Medigadda Project Repairs | గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నష్టం..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2014 కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ. 38 వేల కోట్లతో ప్రారంభించిందని, అప్పటికే 30 శాతం పనులు (సుమారు రూ. 11 వేల కోట్లవి) పూర్తయ్యాయని గుర్తు చేశారు. అయితే, 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్లను మార్చి, మేడిగడ్డ బ్యారేజీని అసంపూర్ణంగా నిర్మించడం వల్లే ప్రాజెక్టు కుంగిపోయిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కావడంతో పాటు, ప్రాజెక్టు వినియోగంలోకి రాకుండా పోయిందని మండిపడ్డారు.
Medigadda Project Repairs | అంతర్జాతీయ నిపుణులతో రీ-డిజైన్..
ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. మేడిగడ్డ కుంగడానికి గల కారణాలను విశ్లేషించేందుకు సీడబ్ల్యూసీ (CWC), ఎన్డీఎస్‌ఏ (NDSA) వంటి సంస్థల ద్వారా సమగ్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. పునరుద్ధరణ పనుల కోసం ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ‘ఆఫ్రీన్’ (Afrin) కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది. ఐఐటీ బాంబే నిపుణుల సలహాలతో రీ-డిజైన్ పనులు జరుగుతున్నాయి. జూలై మొదటి వారం నాటికి పరీక్షలన్నీ పూర్తవుతాయని, నివేదికల ఆధారంగా నవంబర్-డిసెంబర్ మాసాల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భారత సైన్యంలో అనుభవం ఉన్న కల్నల్ పరిషిత్ మెహ్రా నేతృత్వంలోని కమిటీ పనులను పర్యవేక్షిస్తోంది.
Medigadda Project Repairs | పకడ్బందీగా పునరుద్ధరణ..
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను కూడా ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేకుండా, కేవలం సాంకేతికపరంగా అత్యంత పకడ్బందీగా ఈ పనులు నిర్వహిస్తున్నామని, 2027 ఎండాకాలం నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ.. 21 నెలల్లో సగమైన మార్కెట్ క్యాప్
