అక్షరటుడే, కామారెడ్డి: Drunk Driving | తాగి డ్రైవ్ చేస్తే ఏమవుతుందని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కామారెడ్డి జిల్లాలో (Kamareddy) జరిగిన ఈ ఘటన గట్టి గుణపాఠంగా మారింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కిన ఓ వ్యక్తికి న్యాయస్థానం ఏకంగా 12 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
Drunk Driving | చట్టాన్ని పదేపదే ఉల్లంఘిస్తే..
చట్టాన్ని పదేపదే ఉల్లంఘిస్తే న్యాయస్థానాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో ఈ తీర్పు స్పష్టం చేసింది. సదాశివనగర్ పోలీస్ స్టేషన్(Sadashivanagar Police Station) పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అయితే పోలీసులు దీనిని సాధారణ కేసుగా పరిగణించకుండా, నిందితుడి వాహన వివరాలను ఆన్‌లైన్ డేటాబేస్‌లో క్షుణ్ణంగా పరిశీలించారు. దాంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు గతంలో ఐదు సార్లు డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడినట్లు పోలీస్ డిజిటల్ రికార్డులు వెల్లడించాయి.
గతంలో ఎన్నిసార్లు జరిమానాలు విధించినా, కౌన్సెలింగ్ ఇచ్చినా, కఠినంగా హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సమర్పించారు. నిందితుడి పాత రికార్డులను, సమాజ భద్రతను దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానం అతనిపై నమోదైన కేసులను పరిశీలించి మొత్తం 12 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.